Indian AI Server : భారతదేశ స్వదేశీ AI సర్వర్ 'అడిపోలి'ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రదర్శించారు. VVDN టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన AI సర్వర్ అడిపోలిని 8 GPUలతో అమర్చి ఉందని తెలిపారు. అధునాతన ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధస్సు రంగాల్లో భారత్ దూసుకుపోతున్నట్లు చెప్పారు. VVDN టెక్నాలజీస్ ప్రయత్నాలను ప్రశంసించారు. "మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్‌లో స్వదేశీ ఏఐ సర్వర్ ఒక పెద్ద ముందడుగుగా అభివర్ణించారు.
మనేసర్‌లోని VVDN టెక్నాలజీస్ గ్లోబల్ ఇన్నోవేషన్ పార్క్‌లో మాట్లాడిన అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్‌లో వేగవంతమైన పురోగతిని ప్రస్తావించారు. భారతీయ తయారీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మరింత విశ్వసనీయంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీగా మారుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మేధో సంపత్తి హక్కులను రక్షించడంపై భారతదేశం దృష్టి అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు పొందుతోందని తెలిపారు.
India’s AI server… ‘Adipoli’ 👍
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 18, 2025
at VVDN Technologies pic.twitter.com/dJcRDxNYhx
పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోందని, దేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు. "కొంతకాలంగా ఎలక్ట్రానిక్స్ డిజైన్స్‌లో భారత్ సామర్థ్యం బాగా పెరిగింది. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, పవర్ ఎలక్ట్రానిక్స్, సిగ్నలింగ్, భద్రతా వ్యవస్థల రూపకల్పన, తయారీ భారత్‌లో ఎక్కువగా జరుగుతోంది. ఇది ప్రధానమంత్రి 'మేక్ ఇన్ ఇండియా' క్యాంపెయిన్‌లో ఒక విజయం" అని కేంద్ర మంత్రి తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ ఐదు రెట్లు పెరిగి రూ. 11 లక్షల కోట్లకు చేరుకుందని, ఎగుమతులు ఆరు రెట్లు పెరిగి రూ. 3.5 లక్షల కోట్లకు పైగా పెరిగాయని వెల్లడించారు.