Pak Army Attends Terrorists Funeral : 'ఆపరేషన్ సిందూర్' పేరిట ఇండియన్ ఆర్మీ చేసిన వైమానిక దాడుల్లో మరణించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియలకు హాజరైన పాకిస్థాన్ అధికారుల పేర్లను భారత్ విడుదల చేసింది. ఇతర ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులు, పోలీసులు పాల్గొని ప్రార్థనలు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ముష్కరుల అంత్యక్రియలకు హాజరైంది వీరే!
లెఫ్టినెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా ( లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్), మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్ (లాహోర్ 11వ ఇన్ ఫ్రాంట్రీ డివిజన్), బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, పంజాబ్ ప్రావిన్స్ శాసనసభ్యుడు ఉస్మాన్ అన్వర్, మాలిక్ సోహైబ్ అహ్మద్ తదితరులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇందులో పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులు, పంజాబ్ ప్రావిన్స్‌లోని పోలీసులు ఉన్నారు. వీరందరూ ముష్కరులకు పాక్ జెండా కప్పి ప్రార్థనలు చేశారు. కాగా, మే7 భారత సైన్యం పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేపట్టింది. ఈ క్రమంలో టెర్రర్ గ్రూప్‌లు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ చెందిన 100మంది మరణించారు.
రక్షణశాఖ తెలిపిన వివరాల ప్రకారం, పాక్, పీఓకేలోని 21 ఉగ్రవాద శిబిరాలు గుర్తించారు. వాటిలో తొమ్మిది స్థావరాలపై దాడుల జరిపి భారత్ సైన్యం ముష్కరులను మట్టుబెట్టారు. ఇండియన్ ఆర్మీ దాడుల్లో లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది ఖలీద్ అబూ ఆకాషా సహా యాహ్యా ముజాహిద్, ఖారీ యాకూబ్ షేక్, అబ్దుల్ రెహ్మాన్, ఖలీద్ వలీద్, ఇంజనీర్ హరిస్ దార్, అబ్దుల్ రెహ్మాన్ అబిద్ చనిపోయారు.
లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది ఖలీద్ అబూ ఆకాషా పెషావర్‌లో ఉన్నప్పుడు అఫ్గానిస్థాన్ నుంచి పాక్‌కు ఆయుధాలు, పేలుడు సామగ్రిని అక్రమ రవాణా చేసేవాడు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకార్యకలాపాలు చేపట్టేవాడు. అతడు ఇటీవల మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయానికి మారాడు. కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. తాజా భారత వైమానిక దాడుల్లో హతమయ్యాడు.
బుకాయించిన పాక్- ఆఖరికి!
భారత దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం ఇటీవల చర్చనీయాంశమైంది. తొలుత తాము పాల్గొనలేదని పాక్ బుకాయించినా భారత్ ఇప్పుడు ఫొటోలు విడుదల చేసేసరికి అడ్డంగా దొరికిపోయింది.
పాక్ బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలి : ప్రధాని మోదీ
ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్- ఇప్పటికే 100 మంది హతం :భారత సైన్యం