UP Man Dies By Suicide : భార్య వేధింపులు తాళలేక బెంగళూరుకు చెందిన అతుల్ సుభాశ్ బలవన్మరణ తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. తన భార్య, ఆమె కుటుంబం తనను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తోందని ఆరోపిస్తూ ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఇదీ జరిగింది
మోహిత్ యాదవ్ అనే వ్యక్తి ప్రియా అనే యువతి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మోహిత్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఫీల్డ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, కొన్ని రోజులుగా దంపతుల మధ్య విబేధాలు నెలకొన్నాయి. భార్య తరఫు కుటుంబం తనపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఒక వీడియో తీసుకున్నాడు. అనంతరం ఒక హోటల్‌లో బలవన్మరణం చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.
"రెండు నెలల క్రితం నా భార్య ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం సాధించింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న నా భార్యకు మా అత్తయ్య అబార్షన్ చేయించింది. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను కూడా బలవంతంగా మా అత్తయ్యే దగ్గర పెట్టుకుంది. ఇంకా మా పెళ్లి సమయంలో కూడా వారి నుంచి నేను ఒక రూపాయి కట్నం తీసుకోలేదు. తిరిగి నాపైనే తప్పుడు కేసులు పెట్టారు. మా ఆస్తులు తన పేరుపై బదిలీ చేయాలని నా భార్య కూడా తరచూ గొడవకు దిగేది. ఈ విషయంపై వారి కుటుంబ సభ్యులు నన్ను మానసికంగా చిత్రహింసలు పెట్టారు. వారు చెప్పినట్లు చేయకపోతే నా కుటుంబంపై కూడా కేసు పెడతామని బెదిరించారు" అని వీడియోలో మోహిత్ చెప్పాడు.
'అమ్మా నాన్న నన్ను క్షమించండి'
"ఈ విషయంలో మా మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. నా కుటుంబం గురించి ఎంతో ఆందోళన పడుతున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక పోతున్నా, అమ్మనాన్న నన్ను క్షమించండి. నేను చనిపోయాక కూడా న్యాయం జరగకపోతే, నా బుడిదను కాలువలో కలిపేయండి" అంటూ మోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత రికార్డ్ చేసిన వీడియోను సమీప బంధువులకు పంపించి బలవన్మరణం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.