Bomb Threat To Secretariat : రాజస్థాన్‌లోని జైపూర్ కలెక్టరేట్, అల్వార్ జిల్లాలోని మినీ సచివాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీంతో ఆయా జిల్లా కేంద్రాల్లోని పోలీసు విభాగాలు హైఅలర్ట్ మోడ్‌లోకి వచ్చాయి. జైపూర్ కలెక్టరేట్‌లో పోలీసులు, బాంబు స్క్వాడ్ నిపుణులు దాదాపు 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ, బాంబులు కానీ దొరకలేదు. దీంతో పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. భద్రతా సంస్థల నుంచి క్లీన్ చిట్ పొందిన తర్వాతే జైపూర్ కలెక్టరేట్ నాలుగు గేట్లను తెరిచి, ప్రజల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. గురువారం ఉదయం 11.30 గంటలకు జైపూర్ జిల్లా కలెక్టర్ అధికారిక ఈ మెయిల్‌కు బెదిరింపు సందేశం వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పశ్చిమ) అమిత్ బుడానియా తెలిపారు. ఆ మెయిల్‌ను ఎవరు పంపారు? ఎక్కడి నుంచి పంపారు? అనేది తెలుసుకునే దిశగా పోలీసుల సాంకేతిక బృందం దర్యాప్తు చేస్తోందన్నారు. "కలెక్టరేట్ వద్ద సివిల్ డ్రెస్‌లో పోలీసు దళాన్ని మోహరించాం. ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వొచ్చు" అని అమిత్ బుడానియా చెప్పారు.
ప్రజలకు తీవ్ర అసౌకర్యం
జైపూర్ జిల్లా కలెక్టరేట్‌లో డజనుకుపైగా వివిధ ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వాటిలో వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులోనే అదనపు జిల్లా కలెక్టర్లు, సబ్ డివిజనల్ అధికారుల కార్యాలయాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది రకరకాల ప్రభుత్వ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. అకస్మాత్తుగా కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు రావడంతో, ఇక్కడికి వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. భద్రతా చర్యలు, తనిఖీల్లో భాగంగా ప్రజలను ఆయా కార్యాలయాల నుంచి పోలీసులు బయటికి పంపేశారు.

అల్వార్ మినీ సచివాలయంలోనూ ఇలాగే!
రాజస్థాన్‌లోని అల్వార్ నగరం భవానీ తోప్ ప్రాంతంలో ఉన్న మినీ సచివాలయాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది. సోమవారం రాత్రి 3.42 గంటలకు అల్వార్ జిల్లా కలెక్టరేట్‌కు చెందిన అధికారిక ఈమెయిల్‌కు ఈ వార్నింగ్ మెసేజ్ అందింది. "ఆర్‌డీఎక్స్‌ను అమర్చి అల్వార్‌లో ఉన్న మినీ సచివాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా పేల్చేస్తాం" అని ఆ సందేశంలో ఉంది. ఈ ఈమెయిల్‌ను మంగళవారం ఉదయం 7 గంటలకు అధికారులు చూశారు. ఆ వెంటనే పోలీసు విభాగానికి సమాచారాన్ని చేరవేశారు. దీంతో అల్వార్ మినీ సచివాలయంలో పోలీసులు ముమ్మర సోదాలు చేశారు. చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మినీ సచివాలయం లోపలికి వెళ్లే రెండు ప్రధాన గేట్లను మూసేశారు. జైపూర్ నుంచి బాంబు స్క్వాడ్‌ను అల్వార్‌కు పిలిపించి, తనిఖీలు చేయించారు. అనుమానాస్పద వస్తువులేవీ దొరకలేదు. దుండగుల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన బెదిరింపు ఈమెయిల్‌ను ప్రస్తుతం సైబర్ టీమ్ నిపుణులు తనిఖీ చేస్తున్నారు.

వ్యాపారి కారుపై బాంబులతో దాడి- వీడియో వైరల్
సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానన్నది ఎవరో తెలుసా? - థ్యాంక్స్ చెప్పిన సల్లూ భాయ్!