Eknath Shinde Kunal Kamra: స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే తొలిసారి స్పందించారు. కమెడియన్ వేసిన సెటైర్ తనకు అర్థమైందని, అయితే దేనికైనా పరిమితి ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాగే తన పార్టీ కార్యకర్తలు పాల్పడిన విధ్వంసం సరికాదని శిందే ఖండించారు. "ఇలాంటి పనులు చేయడానికి ఆయన ఎవరి నుంచి సుపారీ తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యమే కానీ వేరే వారి తరఫున ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం సరికాదు. నా గురించి మర్చిపోండి.. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి, హోం మంత్రి గురించి ఏం మాట్లాడారో చూడండి" అని గతంలో కామ్రా చేసిన వ్యాఖ్యలను శిందే ప్రస్తావించారు.
"శిందే అనే వ్యక్తి చాలా సున్నితమైన మనస్తత్వం గలవాడు. నాపై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. ప్రతి దానికి నా పనే సమాధానం చెబుతుంది. నేను విధ్వంసాన్ని సమర్థించను. కానీ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినడం వల్ల ఈ ఘటన జరిగింది. ప్రతి యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది. అయితే ఇలాంటి ఘటనలకు నేను మద్దతు ఇవ్వను"
--ఏక్‌నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి
#WATCH | Mumbai, Maharashtra: On Comedian Kunal Kamra refusing to apologise for his statement during a show, Maharashtra Minister Gulab Raghunath Patil says, " if he doesn't apologise, we will speak to him in our own style...shiv sena won't leave him...we won't tolerate this… pic.twitter.com/sBoyV8E2dx
— ANI (@ANI) March 25, 2025
నేను చేసిన కామెడీకి వేదికను కూల్చడం సరికాదు: కునాల్ కామ్రా
అంతకుముందు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని కమెడియన్ కునాల్ కామ్రా స్పష్టం చేశారు. శిందేపై తాను ఉపయోగించిన మాటలు ఇంతకుముందు మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వాడారని చెప్పారు. దాడులకు పాల్పడుతున్న వారిని చూసి భయపడబోనని, మంచం కింద దాక్కొనని ఎక్స్ మాధ్యమంలో కునాల్ కామ్రా పోస్ట్ చేశారు. తాను కామెడీ చేయడానికి ఉపయోగించిన వేదికను కూల్చడం సరికాదని పేర్కొన్నారు. తనకు గుణపాఠం చెబుతానని రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ కేవలం ధనవంతులు, శక్తివంతులమైన వారికి మాత్రమే కాదని తెలిపారు. తనపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా పోలీసులకు, కోర్టులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
My Statement - pic.twitter.com/QZ6NchIcsM
— Kunal Kamra (@kunalkamra88) March 24, 2025
ఇటీవల ముంబయిలోని హబిటాట్ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏక్‌నాథ్ శిందేపై కునాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చడంతో పాటు ఓ హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడటంతో వివాదం చెలరేగింది. దీంతో శివసేన శిందే వర్గం కార్యకర్తలు ఆ స్టూడియోపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో12 మందిని అరెస్టు చేశారు. మరోవైపు పోలీసులు సోమవారం కునాల్‌పై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈక్రమంలోనే బీఎంసీ ఉద్యోగులు భారీ పరికరాలతో అక్కడికి చేరుకొని స్టూడియోలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.