
బిహార్‌లో RJD చుట్టూ రాజకీయాలు- తేజస్వీను అన్‌ఫాలో చేసిన తేజ్ ప్రతాప్
అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్‌లో ఆర్జేడీ కేంద్రంగా కీలక పరిణామాలు- తేజస్వీ యాదవ్‌ను ఎక్స్ ఖాతాలో అన్‌ఫాలో చేసిన తేజ్ ప్రతాప్

Published : October 12, 2025 at 4:04 PM IST
Tej Pratap Unfollows Tejashwi : అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్‌లో ఆర్జేడీ కేంద్రంగానే కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన సోదరుడు తేజస్వీ యాదవ్‌ను ఎక్స్‌లో అన్‌ఫాలో కొట్టారు. ఆయన ఇదివరకే తన చెల్లెళ్లు మిసా, హేమ యాదవ్‌లను ఆన్‌ఫాలో చేశారు. ఇప్పుడు కేవలం ముగ్గురిని మాత్రమే ఫాలో అవుతున్నారు తేజ్ ప్రతాప్. అది కూడా తన కుటుంబ సభ్యులు తండ్రి లాలూ ప్రసాద్, తల్లి రబ్రీ దేవీ, చెల్లెలు రాజ్‌లక్ష్మీ.
మరోవైపు తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక మహిళతో రిలేషన్ షిప్లో ఉన్నారని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. దీంతో నైతిక సామాజిక విలువలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు ఆయన్ను పార్టీ, కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన ఖాతా హ్యాక్ అయ్యిందని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు.
అక్టోబర్ 13న జన్‌శక్తి జనతాదళ్ అభ్యర్థుల పేర్లు ఖరారు!
అయితే ఆర్జేడీ నుంచి బహిష్కరించిన తర్వాత తేజ్ ప్రతాప్ యాదవ్ జన్‌శక్తి జనతాదళ్‌ను స్థాపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 13న ప్రకటిస్తానని చెప్పారు. ఈ ప్రకటన బిహార్ రాజకీయ రంగంలో కీలక పరణామంగా మారనుంది. తేజ్ ప్రతాప్ యాదవ్ స్వయంగా మహూవా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఎందుకంటే 2015లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు.
ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ పార్టీలో మరో కీలక పరిణామం జరిగింది. రాష్ట్రీయ జనతాదళ్ నాయకురాలు విభా దేవి యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజనీమా చేశారు. నవాడా నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నితీశ్ ప్రభుత్వం బిహార్ ప్రజలకు చాలా మంచి పనులు చేసిందని ప్రశంసించారు. నవాడకు ఎంతో మంచి చేశారని, ఇంకా చేస్తారని ఆశిస్తున్నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
మరోవైపు బిహార్ 243 అసెంబ్లీ స్థానాలకు గానూ నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. అదే నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో బిహార్‌లోని రాజకీయాలు వేడెక్కాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సన్నాహాలు ముమ్మరం చేశాయి. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో అధికారిక ఎన్డీఏ, ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ హామీలను ఖరారు చేస్తున్నారు. తాము (ఇండియా కూటమి) అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పటికే హామీ ఇచ్చారు. పట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే ఇందుకు సంబంధించి ప్రతిపాదిత చట్టాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు.
బిహార్ ఎన్నికల్లో 'యూపీ ఫ్యాక్టర్'- పూర్వాంచల్‌లో ఏం జరగబోతోంది?
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు చేయొచ్చు? రూల్స్ ఏమిటి? ఈసీ గీత దాటితే ఏమవుతుంది?

