Shabarimala Ayyappa Gold Lockets : అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు-టీడీబీ శుభవార్త చెప్పింది. అయ్యప్ప రూపంలో ఉన్న బంగారు లాకెట్ల పంపిణీ సోమవారం విషు పర్వదినం సందర్భంగా ప్రారంభించింది. శబరిమల ఆలయం గర్భ గుడిలో ఉంచి పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ ప్రారంభించారు. దీంతో చాలాకాలంగా ఉన్న అయ్యప్ప భక్తుల డిమాండ్ నేరవేరిందని బోర్డు తెలిపింది.
తొలి లాకెట్ అతడికే!
ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడికి మంత్రి వాసవన్ మొదటి లాకెట్ అందజేశారు. ఆ తరువాత శబరిమల తంత్రి (ప్రధాన పూజారి) కందరారు రాజీవరు, టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, బోర్డు సభ్యుడు ఏ అజికుమార్ మిగిలిన భక్తులకు లాకెట్లను పంపిణీ చేశారు.
లకెట్ల ధరలు ఇవే!
అయ్యప్ప లాకెట్లను 2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాములలో సైజుల్లో తయారు చేసినట్లు టీడీబీ తెలిపింది. 2గ్రాముల బంగారు లాకెట్ ధర రూ. 19,300గా నిర్ణయించారు. 4గ్రాముల లాకెట్ ధర రూ.38,600, 8గ్రాముల బరువున్న బంగారు లాకెట్ ధర రూ.77,200 అని టీడీబీ తెలిపింది. బుకింగ్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే మొత్తం 100 మంది భక్తులు లాకెట్లను బుక్ చేసుకున్నారని టీడీబీ ప్రకటనలో పేర్కొంది.
ఆన్లైన్లో కొనొచ్చు
అయ్యప్ప భక్తులు ఈ బంగారు లాకెట్లను రెండు విధాలుగా కొనుగోలు చేయవచ్చని దేవస్థానం బోర్డు ఇంతకుముందు తెలిపింది. ఆన్ లైన్ (WWW.sabarimalaonline.org) లేదా ఆలయ ప్రధాన ప్రాంతమైన సన్నిధానంలోని దేవస్వోమ్ పరిపాలనా కార్యాలయంలో నగదు చెల్లించడం ద్వారా పొందవచ్చని వెల్లడించింది. బంగారు లాకెట్‌ను ఆలయ పవిత్ర గర్భగుడి లోపల పూజలు నిర్వహించి అందజేస్తారు. ఇలా చేయడం వల్ల భక్తులకు అదనపు ప్రత్యేకతను ఇస్తుందని దేవస్థానం పేర్కొంది.
జీఆర్‌టీ, కల్యాణ్‌కు బంగారు లాకెట్ల టెండర్లు
అయ్యప్ప స్వామి ఫొటోతో బంగారు లాకెట్లను తయారు చేసి సప్లై చేసే టెండర్లను తమిళనాడుకు చెందిన జీఆర్‌టీ జ్యువెల్లర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెల్లర్స్ దక్కించుకున్నాయి. మలయాళ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలోని తొలి మాసం పేరు 'మెదమ్'. ఈ నెలలోని మొదటి రోజే 'విషు'. విషు పర్వదిన వేడుకల్లో ఈ బంగారు లాకెట్లు ముఖ్యమైన భాగం. ఇది శబరిమల సందర్శించే వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత సుసంపన్నం చేస్తుందనే భావన ఉంది.
నెరవేరిన అయ్యప్ప భక్తుల కల! శబరిమల దర్శనానికి కొత్త మార్గం! ఇక సంతృప్తిగా స్వామి దర్శనం!
శబరిమల భక్తులకు ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్- రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి ఫ్యామిలీకి రూ.5 లక్షలు