Short Hight Couple Marriage : పెళ్లిళ్లను మనం పుట్టకముందే దేవుడు నిర్ణయిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఆ మాటలను నిజం చేసేలా హరియాణాలోని అంబాలాలో ఓ విలక్షణ వివాహం జరిగింది. 3 అడుగుల 6 అంగుళాల వధువుతో, 3 అడుగుల 8 అంగుళాల వరుడికి పెళ్లి చేశారు. వరుడు నితిన్ వర్మ హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ఏరియా వాస్తవ్యుడు. వధువు ఆరుషి పంజాబ్‌లోని రోపార్ వాస్తవ్యురాలు. ఏప్రిల్ 10న జరిగిన ఈ ఇద్దరి వివాహంతో ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఫీలయ్యాయి. ఈ పెళ్లిపై వరుడు నితిన్ తల్లి మోనిక హర్షం వెలిబుచ్చారు. "మా అబ్బాయికి అదే వయస్సు, ఎత్తు ఉన్న అమ్మాయి దొరికింది. ఇందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం" అని చెప్పారు.

కట్నం లేకుండా పెళ్లి
25 ఏళ్ల నితిన్ వర్మ, 23 ఏళ్ల ఆరుషి కట్నం లేకుండానే ఈ పెళ్లి చేసుకున్నారు. ఈ వధూవరుల ఎత్తు తక్కువగా ఉన్నా, వారి ఆత్మవిశ్వాసం, ప్రేమభావం సమాజంలోని ఇతరులకు ప్రేరణ ఇచ్చాయి. వరకట్నం, ఎత్తు, శరీరాకృతి వంటి వాటిని కొలమానాలుగా భావించే వారందరికీ నితిన్, ఆరుషిల పెళ్లి ఘట్టం ఒక ప్రేరణగా నిలిచింది. నితిన్ బంధువు ఒకరికి తొలుత ఆరుషి గురించి తెలిసింది. దీంతో వారు పంజాబ్‌లోని రోపర్‌కు వెళ్లి ఆరుషి కుటుంబం గురించి ఆరా తీశారు. ఆరుషిది పేద కుటుంబం అని గుర్తించారు. ఇదే విషయాన్ని నితిన్ తల్లిదండ్రులకు చెప్పగా, కట్నం తీసుకోకుండానే తమ కుమారుడికి పెళ్లి చేస్తామన్నారు. ఈవిధంగా కట్నకానుకలు లేకుండానే నితిన్, ఆరుషిల పెళ్లికి మార్గం ఏర్పడింది. వీలైనంత తక్కువ ఖర్చులో సింపుల్‌గా పెళ్లి ఘట్టాన్ని ఏప్రిల్ 10న పూర్తి చేశారు. ఇప్పుడు నవ దంపతులు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.

బీఏ వరకు చదివిన ఆరుషి
వధువు ఆరుషి నేపథ్యంలోకి వెళితే ఇంట్లోని నలుగురు తోబుట్టువులలో ఆమెనే పెద్దది. ఆరుషి బీఏ వరకు చదువుకుంది. చాలా ఏళ్ల పాటు తన కుటుంబానికి బలమైన మద్దతుగా నిలిచింది. చదువుకున్న కోడలు దొరికిందని నితిన్ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ కొత్త జంటను అభినందించడానికి, ఆశీర్వదించడానికి నితిన్ ఇంటికి వస్తున్నారు. ఈ ప్రత్యేక వివాహ ఘట్టం గురించి సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది.

అయోధ్య గర్భగుడి శిఖరంపై 161 అడుగుల కలశం- శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు
మోదీ కోసం చెప్పులు లేకుండానే 14 ఏళ్లు - స్వయంగా బూట్లు ఇచ్చి అభిమాని కోరిక తీర్చిన ప్రధాని