Taj Mahal Water Leakage Working : ప్రపంచ ప్రఖ్యాత పాలరాతి కట్టడం తాజ్ మహల్ మరమ్మతుల కోసం భారత పురావస్తు శాఖ (ASI) ఈ ఏడాది రూ.76 లక్షలు ఖర్చు చేయనుందని అధికారులు తెలిపారు. రాబోయే వర్షాకాలంలో ఎటువంటి లీకేజీలు రాకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ నిధులను తాజ్ మహల్ ప్రధాన గోపురం, పైకప్పు రిపేర్ల కోసం వాడనున్నట్లు పేర్కొన్నారు.
వాటరీ లీకేజీ వీడియోలు వైరల్
కాగా, గతేడాది భారీగా వర్షాల కారణంగా తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆ కట్టడం సంరక్షణను చూస్తున్న భారత పురావస్తు శాఖపై విమర్శలు వచ్చాయి. దీంత ఏఎస్ఐ అప్రమత్తమైంది. ఈ వర్షాకాలంలో తాజ్ మహల్ నీరు కారకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే పాలరాతి కట్టడం రిపేర్ల కోసం రూ.76 లక్షలను ఖర్చు చేయనుంది.
ఈ నెలలోనే పనులు ప్రారంభం
తాజ్ మహల్ ప్రధాన గోపురం మరమ్మతు పనులు త్వరలో ప్రారంభమవుతాయని భారత పురావస్తు శాఖ అధికారి ఒకరు తెలిపారు. "ప్రధాన గోపురం, పైకప్పు మరమ్మతులు చేస్తాం. వాటితో పాటు దెబ్బతిన్న పాలరాళ్ల స్థానంలో కొత్త వాటిని భర్తీ చేస్తాం. ప్రధాన గోపురం సంరక్షణ పనులకు రూ. 19.82 లక్షల విలువైన సామగ్రిని ఉపయోగించనున్నారు. అయితే ఈ మొత్తం పనికి రూ.56.93 లక్షలు ఖర్చు చేయనున్నారు." అని ఏఎస్ఐ అధికారి పేర్కొన్నారు. మరోవైపు, తాజ్ మహల్ ప్రధాన గోపురం సంరక్షణ పనులు మే మధ్యలో ప్రారంభమవుతాయని సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రిన్స్ వాజ్ పేయి తెలిపారు. ఆ సమయంలో పర్యటకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా చూస్తామన్నారు.
ఎనిమిదో వింతగా ప్రసిద్ధి
ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో ఉన్న ప్రముఖ పాలరాతి కట్టడం తాజ్ మహల్‌ను చూసేందుకు దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. దీన్ని ప్రపంచంలో ఎనిమిదో వింతగా భావిస్తారు. అయితే గతేడాది సెప్టెంబర్ 10- 13 వరకు ఆగ్రాలో భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ 12న తాజ్ మహల్ లో ఉన్న మొఘల్ చక్రవర్తి షాజహాన్, ఆయన భార్య ముంతాజ్ బేగం సమాధుల దగ్గర నీరు కారుతున్న వీడియోలు, ఫొటోలను ఓ పర్యటకుడు తీశాడు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. దీంతో తాజ్ మహల్‌ను నిర్వహిస్తున్న భారత పురావస్తు శాఖపై విమర్శలు వచ్చాయి.
అయితే, అప్పట్లో తాజ్ మహల్ ప్రధాన గోపురాన్ని లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లిడార్) టెక్నాలజీతో పరిశీలించింది ఏఎస్ఐ బృందం. జీపీఎస్, స్కానర్ సాయంతో ప్రధాన ద్వారాన్ని పరిశీలించారు. లైడార్ పరీక్ష తర్వాత వచ్చిన నివేదికలో తాజ్ మహల్ ప్రధాన గోపురంపై ఉన్న రాళ్ల మధ్య ఉన్న మోర్టార్ క్షీణించిందని తేల్చారు. అందుకు వర్షం నీరు అందులోకి వెళ్లిపోయిందని చెప్పారు.
అయోధ్య రామాలయ శిఖరంపై బంగారు కలశం- రామ దర్బార్‌లో బంగారు తలుపు
2గంటల్లోనే కోటీశ్వరుడైన కూరగాయల వ్యాపారి- రూ.6కోట్ల జాక్ పాట్