Tahawwur Rana Links With Pakistan Army : ముంబయి ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ రాణా విచారణలో కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ వైద్య దళంలో కొంతకాలం పనిచేసి బయటికొచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా లష్కరే తైబా ఉగ్రవాదులు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సంబంధీకులను కలిసేటప్పుడు ఆర్మీ యూనిఫాంనే రాణా ధరించేవాడట. ఈవిషయాన్ని విచారణ క్రమంలో ఎన్‌ఐఏ అధికారులకు రాణా చెప్పాడని సమాచారం. తనది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న చిచావత్ని గ్రామమని, తన తండ్రి ఒక పాఠశాల ప్రిన్సిపాల్ అని తహవ్వుర్ రాణా చెప్పినట్లు సమాచారం. ముగ్గురు అన్నదమ్ములలో రాణా ఒకడు. అతడి సోదరులలో ఒకరు పాకిస్తాన్ సైన్యంలో మనోరోగ వైద్యుడిగా, మరొకరు జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.
ఆర్మీ క్యాడెట్ కాలేజీలో హెడ్లీతో రాణాకు పరిచయం
పాకిస్థాన్‌లోని హసనబ్దల్‌లోని ఆర్మీ క్యాడెట్ కాలేజీలో రాణా చదువుకున్నాడు. అక్కడే అతడికి డేవిడ్ కోల్మన్ హెడ్లీ (దావూద్ సయ్యద్ గిలానీ)తో తొలిసారిగా పరిచయం ఏర్పడింది. తహవ్వుర్ రాణా 1997లో తన భార్య, ప్రాక్టీసింగ్ ఫిజీషియన్ సమ్రాజ్ రాణా అక్తర్‌తో కలిసి కెనడాకు వెళ్లాడు. అక్కడ ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. ఆ తర్వాత హలాల్ మాంసం వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అయితే, రాణాకు చెందిన కన్సల్టెన్సీ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. రాణాకు చెందిన కన్సల్టెన్సీ తరఫున డేవిడ్ హెడ్లీ కన్సల్టెంట్‌గా నటిస్తూ ముంబయి నగరంలో పర్యటించాడు. కాగా, 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక నిందితుడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో జైలులో ఉన్నాడు.
సాజిద్ మీర్‌తో రాణాకు సంబంధాలు
అంతర్జాతీయ ఉగ్రవాది, భారతదేశ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల్లో ఒకడైన సాజిద్ మీర్‌తో రాణాకు మంచి సంబంధాలు ఉండేవని దర్యాప్తులో వెల్లడైంది. 2008 నవంబరు 26 నుంచి 29 వరకు జరిగిన ముంబయి ఉగ్రదాడుల్లో మీర్ కీలక పాత్ర పోషించాడని, ఆరుగురు బందీల మరణానికి దారితీసిన చాబాద్ హౌస్ ముట్టడికి ప్లాన్ ఇచ్చింది సాజిద్ మీరే అని ఆరోపణలు ఉన్నాయి. మీర్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే వారికి 5 మిలియన్ల డాలర్ల బహుమతిని ఇస్తామని అమెరికా ప్రకటించింది. 2008లో ముంబయిలోని చాబాద్ హౌస్‌ను ఉగ్రవాదులు ముట్టడించే వేళ వారితో సాజిద్ మీర్ సమన్వయం చేసుకున్నట్లు నిర్ధరించే ఆడియో క్లిప్‌లను 2022లో ఐక్యరాజ్యసమితికి భారత్ అందించింది.
ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్‌ను కలిసిన రాణా
రాణా పాకిస్థాన్ సైనిక యూనిఫాంలో ఆర్మీకి చెందిన మేజర్ ఇక్బాల్‌ను కలిశాడని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. ఐఎస్ఐ అధికారిగా ఇక్బాల్ పనిచేసే వాడనే సమాచారం తమకు ఉందని తెలిపాయి. ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ నిఘా కార్యకలాపాలకు నిధులను సమకూర్చడం, పర్యవేక్షించడం, దిశానిర్దేశం చేయడం వంటివన్నీ ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ చేశాడంటూ అమెరికా దర్యాప్తు సంస్థ 2010లో అభియోగాలను నమోదు చేసింది. 2011లో ఈవిషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థల ఎదుట డేవిడ్ హెడ్లీ ఒప్పుకున్నాడు. పాకిస్థాన్ ఐఎస్ఐ తరఫున తనను నిర్వహించే ప్రైమరీ హ్యాండ్లర్‌గా మేజర్ ఇక్బాల్ ఉండేవాడని చెప్పాడు. రిక్రూట్‌మెంట్, ట్రైనింగ్, మార్గనిర్దేశానికి తనకు ఐఎస్ఐకు చెందిన ముగ్గురు అధికారులు సహకరించారని వారిలో మేజర్ ఇక్బాల్ ఒకరని డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. అమెరికా కోర్టు నుంచి మరణశిక్షను తప్పించుకునేందుకు 2010లో మరో కీలక సమాచారాన్ని కూడా అమెరికా దర్యాప్తు సంస్థలకు హెడ్లీ అందించాడు. చౌదరీ ఖాన్ అనే పేరుతో మేజర్ ఇక్బాల్ తనతో చేసిన 20 ఈమెయిల్ సంభాషణల చిట్టాను కూడా దర్యాప్తు సంస్థల చేతిలో పెట్టాడని తాజా కథనాల్లో ప్రస్తావించాడు.