Tahawwur Rana Extradition : ముంబయి ఉగ్రదాడి నిందితుడు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి దిల్లీకి తీసుకొచ్చారు. ఆయనను తీసుకొచ్చిన భారత్ పంపిన ప్రత్యేక విమానం పాలం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారికంగా ప్రకటించారు. 2008 అల్లకల్లోలం వెనుక కీలక కుట్రదారుడిని న్యాయం ముందు నిలబెట్టడానికి ఏళ్ల తరబడి చేసిన నిరంతర ప్రయత్నాల తర్వాత తహవూర్ హుస్సేన్ రాణాను అప్పగించడంలో విజయం సాధించినట్లు NIA తెలిపింది. అప్పగింతను అడ్డుకునేందుకు రాణా అమెరికాలో అన్ని చట్టపరమైన మార్గాలను వినియోగించుకున్న తర్వాత చివరికి అతడిని మనకు అప్పగించినట్లు NIA ప్రకటించింది.
భద్రత కట్టుదిట్టం
ఈ మేరకు అంతకుముందే N.I.A అధికారులు పాలం ఎయిర్ ఫోర్స్ బేస్‌లో సిద్ధంగా ఉన్నారు. భారత్‌కు రాగానే రాణాను N.I.A అధికారులు అరెస్ట్ చేసి దిల్లీ పటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని NIA ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. కోర్టు రిమాండ్ విధించిన వెంటనే తిహాడ్ జైలుకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. పాలం విమానాశ్రయం, పటియాలా హౌస్ కోర్టు, తిహాడ్ జైలు వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. తిహాడ్ జైలులో అత్యంత భద్రత కలిగిన బ్యారక్ లో రాణాను ఉంచేందుకు సర్వం సిద్ధం చేశారు. జైలు నంబర్ 2లో అతడిని ఉంచనున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా N.I.A ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియం మెట్రో స్టేషన్ రెండో గేటును మూసివేశారు. అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్
తహవ్వుర్ రాణా అప్పగింత నేపథ‌్యంలో ముంబయి దాడుల కేసులో పటిష్టమైన వాదనలు వినిపించేందుకు కేంద్ర హోంశాఖ పటిష్టమైన న్యాయవాద బృందాన్ని సిద్ధం చేసింది. రాణా అప్పగింత కోసం అమెరికా కోర్టులో వాదనలు వినిపించిన బృందానికి నాయకత్వం వహించిన సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, N.I.A తరపున వాదనలకు నేతృత్వం వహించనున్నారు. మరో సీనియర్ క్రిమినల్ లాయర్ "నరేందర్ మాన్"ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కేంద్ర హోంశాఖ నియమించింది. దయాన్ కృష్ణన్‌కు నరేందర్ మాన్ సహాయ సహకారాలు అందించనున్నారు. N.I.A న్యాయవాద బృందంలో సంజీవిశేషాద్రి, శ్రీధర్ కాలే కూడా ఉన్నారు.
విచారణ వేగవంతం!
ముంబయి దాడులపై 2009 నవంబరు 1న దిల్లీలోని N.I.A పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవ్వుర్ హుస్సేన్ రాణా, ఇతరులను నిందితులుగా చేర్చారు. రాణా, హెడ్లీలను అప్పగించాలని గతంలోనే అమెరికాను కోరింది. దర్యాప్తులో సాయం చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేసు దర్యాప్తు పూర్తిచేసిన N.I.A మొత్తం 9 మంది నిందితులపై 2011 డిసెంబర్ 24న పాటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని N.I.A న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది. రాణా రాకతో ఆ కేసు విచారణలో వేగం పుంజుకోనుంది.
రాణాను అమెరికా భారత్‌కు అప్పగించకముందే ముంబయి దాడుల కేసుకు సంబంధించిన విచారణ ఫైళ్లు దిల్లీ కోర్టుకు చేరాయి. నవంబరు 26 దాడులపై ముంబయిలోనూ అనేక కేసులు ఉన్న నేపథ్యంలో దిల్లీ నుంచి విచారణ దస్త్రాలను అక్కడికి పంపారు. ఇటీవల NIA చేసిన విజ్ఞప్తి మేరకు ముంబయి కోర్టు నుంచి దిల్లీ న్యాయస్థానానికి ఫైళ్లు చేరాయి. జిల్లా కోర్టు న్యాయమూర్తి విమల్ కుమార్ యాదవ్ వాటిని స్వీకరించారు. రాణాను N.I.A కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇస్తే ముంబయి దాడుల వెనక పాకిస్థాన్ ప్రభుత్వ హస్తం బహిర్గతమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబయికి చేరుకుని సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు జరిగిన నాటి మారణహోమంలో 18 మంది భద్రత సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.