Tomato Farmers Success Story : మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన రైతులు తీవ్రమైన నీటి కొరత ఉన్న పీఠభూమి ప్రాంతంలో టమాటా సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఏడాది పొడవునా టమాటాను పండిస్తూ రూ.లక్షల్లో రాబడిని పొందుతున్నారు. తాగడానికి నీరే దొరకని గ్రామంలో బిందు సేద్య విధానంలో టమాటాలను పండించి దేశంలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో కర్షకుల సక్సెస్ స్టోరీపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
తాగడానికి నీరు దొరకకపోయినా!
అహల్యానగర్ జిల్లాలోని పింపాల్ గావ్ దేపా అనే గ్రామం పీఠభూమి ప్రాంతంలో ఉంది. కరవు, తీవ్రమైన నీటి కొరతతో, తాగునీటి కోసం ఈ గ్రామస్థులు ట్యాంకర్లపై ఆధారపడుతుంటారు. రాతి భూముల కారణంగా వర్షపు నీరు నిల్వ ఉండదు. ఈ క్రమంలోనే గ్రామ రైతులు నీటి సమస్యను ఎదుర్కొనేందుకు మంచి ఆలోచన చేశారు. వర్షపు నీటిని ఒక వ్యవసాయ చెరువులో నిల్వ చేసుకున్నారు. ఆ నీటిని టమాటా సాగుకు వాడుకుని మంచి లాభాలను గడిస్తున్నారు. గ్రామస్థులందరూ బిందు సేద్యం ద్వారానే పంటలు పండిస్తున్నారు. దీంతో గ్రామమంతా టమాటా సాగులో విజయవంతమైన నమూనాగా మారిపోయింది. ఈ గ్రామ రైతులను ప్రేరణగా తీసుకుని పీఠభూమి ప్రాంతంలోని గుజల్వాడి, ముధోల్వాడి, ఖండేరావుడి వంటి అనేక ఇతర గ్రామాల రైతులు కూడా టమాటా సాగును ప్రారంభించారు.

బిందు సేద్య విధానంలో టమాటా సాగు
పీఠభూమి ప్రాంతంలో రాతి భూభాగం ఉండడంతో సంప్రదాయ వ్యవసాయం చేయడం కష్టం. ఎందుకంటే సాంప్రదాయ వ్యవసాయానికి ఎక్కువ నీరు అవసరం. దీంతో పింపాల్ గావ్ గ్రామ రైతులు తక్కువ నీరు, తక్కువ వ్యవధిలో పండే టమాటా సాగును ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ గ్రామస్థులు శీతాకాలం, వర్షాకాలం, వేసవి కాలంలోనూ టమాటాలను పండిస్తున్నారు. పుణె, నాశి వ్యవసాయ మార్కెట్లు దగ్గరగా ఉండడంతో తమ వస్తువులను సునాయాసంగా రవాణా చేయగలుగుతున్నారు. తాము పండించిన టమాటాలకు మంచి ధరలు లభిస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


పీఠభూమి ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. కురిసే వర్షం కూడా రాతి నేల గుండా ప్రవహిస్తుంది. రైతులు ఈ నీటిని వ్యవసాయ చెరువులు, బావులలో నిల్వ చేశారు. ఈ నిల్వ నీటితో ఏడాదంతా టమాటాను సాగు చేస్తున్నారు. ఈ పంటను పండించేటప్పుడు రైతులు మల్చింగ్ పేపర్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే బిందు సేద్యం ద్వారా మొక్కలకు నీరు అందిస్తున్నారు. దీని కారణంగా మొక్కలను అవసరమైనంత నీరే వెళ్తుంది. నీటి వృధా జరగదు. నిల్వ చేసిన వర్షపు నీరు శీతాకాలం, వర్షాకాలం, వేసవిలో సగం కాలానికే వస్తుందని రైతులు చెబుతున్నారు. ఆ తర్వాత తాగు, సాగు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుందని వాపోతున్నారు. వేసవిలో ఎవరైనా తాగునీటిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దేశానికి ఆదర్శంగా ఆ గ్రామం
వర్షపు నీటిని నిల్వ చేసి తమకు కావాల్సిన సమయంలో వాడుకుని పింపాల్ గావ్ దేపా రైతులు దేశంలోని కర్షకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరవు ప్రాంతంలో నీటి కష్టాలను అధిగమించి టమాటా సాగులో రాణిస్తున్నారు. రాతి నేలలో పచ్చదనాన్ని సృష్టించి ఔరా అనిపిస్తున్నారు.