Mayawati Says Suspend Waqf Act : వక్ఫ్ చట్టంలోని నిబంధనలను పునఃపరిశీలించి, ప్రస్తుతానికి దానిని నిలిపివేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డ్‌లో చేర్చడానికి వీలుకల్పిస్తూ నిబంధనలు మార్చడం ఏమాత్రం మంచిది కాదని ఆమె అన్నారు.
"ముస్లిమేతరులను రాష్ట్ర వక్ఫ్ బోర్డ్‌లో భాగం కావడానికి అనుమతించే నిబంధన తప్పుగా కనిపిస్తోంది. ముస్లిం సమాజం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఇతర వివాదాస్పద నిబంధనలను సంస్కరించాలి. ఇందుకోసం వక్ఫ్ చట్టాన్ని పునఃపరిశీలించి, వాటిని నిలిపివేస్తే మంచిది."
- మాయావతి, బీఎస్‌పీ అధ్యక్షురాలు
వక్ఫ్ చట్టం ఆమోదం పొందిందిలా!
వక్ఫ్ సవరణ చట్టంపై ఏప్రిల్ 3న లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. దీనితో లోక్ సభలో చాలా సులువుగా ఈ బిల్ల్ పాస్ అయిపోయింది.
ఏప్రిల్ 4న ఈ బిల్లుపై రాజ్యసభలో 13 గంటలకు పైగా చర్చ జరిగింది. తరువాత జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు 128 మంది సభ్యులు అనుకూలంగా, 95 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనితో రాజ్య సభలోనూ ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ విధంగా పార్లమెంట్ ఆమోదంతో వచ్చిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 5న ఆమోద ముద్ర వేశారు. దీనితో ఇది చట్టంగా మారింది. ఈ చట్టం ఏప్రిల్ 8 నుంచే అమల్లోకి వచ్చింది.
సుప్రీంకోర్ట్‌లో సవాల్ చేసిన ముస్లిం సంఘాలు
కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై విపక్ష పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ 16న విచారణ జరపనుంది. దీనిపై కేంద్రం కేవియట్‌ను దాఖలు చేసింది. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయొద్దంటూ ఈ పిటిషన్‌లో పేర్కొంది.