Waqf Case In SC : వక్ఫ్ సవరణ చట్టం-2025ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం కేంద్ర తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరపున న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి వాదనలను మూడురోజుల పాటు విన్నది. అనంతరం తీర్పును సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం రిజర్వ్ చేస్తున్నట్లు గురువారం వెల్లడించింది.
అయితే వాదనల సమయంలో కేంద్రప్రభుత్వం వక్ప్ చట్టాన్ని గట్టిగా సమర్థించింది ఆ చట్టాన్ని నిలిపివేయలేమని కోర్టుకు తెలిపింది. వక్ఫ్ అనేది లౌకిక భావన అని, ఇస్లాంలో భాగం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రంకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కు ఉండదని అన్నారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటిస్తే ప్రభుత్వం ఆ ఆస్తిని కాపాడుకోగలదని గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చెబుతోందని గుర్తు చేశారు.
చట్టపరమైన, రాజ్యాంగ సూత్రాల నుంచి పూర్తిగా నిష్క్రమించిన చట్టంగా వక్ప్ చట్టాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వర్ణించారు. న్యాయరహిత ప్రక్రియ ద్వారా వక్ఫ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఒక మార్గమని అన్నారు. వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనతోనే సవరణ చట్టంలో పలు నిబంధనలను రూపొందించారని ఆరోపించారు. ప్రస్తుత దశలో మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు కోరారు.
ఆ మూడు అంశాలు ఇవే!
- న్యాయస్థానాలు వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన వాటిని డీనోటిఫై చేసే అధికారం
- కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ మండళ్ల కూర్పు
- ప్రభుత్వ భూమిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనడంపై తలెత్తిన వివాదంలో కలెక్టర్ విచారణ జరిపితే దానిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకపోవడం
పార్లమెంటు ఉభయ సభల ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో వక్ఫ్ సవరణ చట్టం-2025 ఇటీవల అమల్లోకి వచ్చింది. వక్ప్ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం సవరణల వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు.
హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా?- 'వక్ఫ్' కేసు విచారణలో సుప్రీంకోర్టు
'వక్ఫ్ ఆందోళనలు ప్రీ ప్లాన్‌గా జరిగాయి'- కేంద్రంపై మమతా బెనర్జీ ఫైర్