Supreme Court On Waqf Act : వక్ఫ్ చట్ట సవరణ కేసులో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వివాదాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫున తొలుత వాదనలు వినిపించిన కపిల్ సిబల్, వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘించేలా ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపారు. అనంతరం వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఎంతో కసరత్తు చేశాక వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై జేపీసీ 38 సమావేశాలు నిర్వహించినట్లు వివరించారు. సుమారు 98.2లక్షల విజ్ఞప్తులను పరిశీలించిందన్నారు. వక్ఫ్ బిల్లును పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సీజేఐ, హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా? అని ప్రశ్నించారు. వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టే ఇవ్వనున్నట్లు తెలిపిన ధర్మాసనం, గురువారం మధ్యంతర ఉత్తర్వులను ప్రకటించినున్నట్లు పేర్కొంది.