Supreme Court New CJI : సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషన్ రామకృష్ణ గవాయ్ నియామకం కానున్నారు. జస్టిస్ BR గవాయ్‌ను తదుపరి సీజేఐగా నియమించాలంటూ కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రతిపాదన చేశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13వ తేదీన ముగియనుంది.
సంప్రదాయం ప్రకారం తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నాను న్యాయశాఖ కోరగా, ఆయన జస్టిస్ BR గవాయ్ పేరును ప్రతిపాదించారు. ఫలితంగా మే 14వ తేదీన జస్టిస్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 6 నెలల పాటు ఆ బాధ్యత నిర్వహించి నవంబర్‌లో పదవీ విరమణ చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతను నిర్వహించనున్న రెండో దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిగా జస్టిస్ గవాయ్ నిలవనున్నారు. ఆయన కన్నా ముందు 2007లో దళిత కుటుంబానికి చెందిన జస్టిస్ KG బాలకృష్ణన్ సీజేఐ పదవిని చేపట్టారు.