ETV Bharat / bharat

కాల్పుల భయాలు పటాపంచలు- కంటిచూపు లేకపోయినా మనసులను కదిలించే పాటలు

మావోయిస్టుల కంచుకోటలో మనసులను కదిలించే గొంతుక- భయాలు, ఆందోళనలను పటాపంచలు చేస్తున్న ఓ బాలిక పాటలు-

Sukma Lata Mangeshkar Story
Sukma Lata Mangeshkar Story (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : October 7, 2025 at 2:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sukma Lata Mangeshkar Sodhi Veere Story : ఆమె కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడలేదు. కానీ మనుషులను బాగా అర్థం చేసుకోగలదు. వారి మనసులను తేలికపరిచే చక్కటి పాటలను పాడగలదు. ప్రతీ మదిలో భక్తిభావాన్ని రగల్చగలదు. మావోయిస్టుల కంచుకోటలోని పోలంపల్లి గ్రామానికి చెందిన ఆ బాలికను అందరూ 'సుక్మా లతా మంగేష్కర్' అని పిలుస్తుంటారు. ఆమె పాటలు బుల్లెట్ల కంటే పదునైనవని, తమ హృదయాల్లో నిలిచిపోయాయని గ్రామస్థులు అంటున్నారు. ఇంతకీ ఆ బాలిక కంటిచూపును ఎలా కోల్పోయింది ? సుక్మా లతా మంగేష్కర్ అనే పేరును ఎలా సంపాదించింది ? తుపాకీ కాల్పుల శబ్దాలతో ఏర్పడిన భయాలను ఆమె పాటలు ఎలా మటుమాయం చేశాయి ? ఈ కథనంలో తెలుసుకుందాం.

కష్టాల వలయంలో ఉన్నా ఆత్మ స్థైర్యం కోల్పోలేదు
ఆమె పేరు సోధి వీరే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి గ్రామానికి చెందిన సోధి లక్కా కుమార్తె. ఆయన డోర్నపాల్‌లోని ఒక మిల్లులో దినసరి కూలీగా పని చేస్తున్నారు. సోధి వీరే జన్మించిన కొన్నేళ్లకే కంటిచూపును కోల్పోయింది. పేదరికం కారణంగా ఆమెకు తల్లిదండ్రులు వెంటనే వైద్యం చేయించలేకపోయారు. దీంతో సోధి వీరేకు శాశ్వతంగా కంటిచూపు దూరమైంది. ఆకార్ సంస్థకు చెందిన గురుకుల పాఠశాలలో ఆమెను చదివించారు. అక్కడ సాధారణ విద్యతో పాటు సంగీతాన్ని కూడా నేర్పించారు. ఈవిధంగా పాటలు, గేయాలు, గీతాలను అద్భుతంగా ఆలపించడాన్ని సోధి వీరే నేర్చుకున్నారు. ప్రస్తుతం సుక్మాలోని పీఎం శ్రీ స్కూల్‌లో ఆమె ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. కష్టాలను ఎదుర్కొంటూ, పేదరికం, వైకల్యంతో పోరాడుతున్నప్పటికీ సోధి వీరే ఎన్నడూ ఆత్మ స్థైర్యాన్ని కోల్పోలేదు. ఆత్మవిశ్వాసంతో ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంది.

Sukma Lata Mangeshkar Story
సోధి వీరే (ETV Bharat)

భయాలు, ఆందోళనలను పటాపంచలు చేసే అస్త్రం
పోలంపల్లి గ్రామంలో సోధి వీరే చాలా ఫేమస్. అందరూ ఆమెను 'సుక్మా లతా మంగేష్కర్' అని పిలుస్తుంటారు. ఈ ఊరి చుట్టూ ఉన్న అడవులు ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట. ఈ అడవుల్లో గతంలో ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయి. రక్తపాతం చోటుచేసుకుంది. తుపాకీ కాల్పుల మోతల వల్ల ఇక్కడి ప్రజల మనసుల్లో భయాలు నాటుకుపోయాయి. ఈ భయాలు, ఆందోళనలను పటాపంచలు చేసే మహత్తర అస్త్రంగా సోధి వీరే గొంతుక మారింది. 'ఆవో గాయే మహిమా భోలేనాథ్ కి' లాంటి ఎన్నో భక్తిగీతాలతో పోలంపల్లి గ్రామస్థులను ఆమె చైతన్యవంతం చేస్తున్నారు. ఈ పాటలు విన్నవారు ఎవరైనా సరే సోధి వీరేకు కంటిచూపు లేదంటే అస్సలు నమ్మరు. ఆమె పాటల నుంచి తాము పొందిన స్ఫూర్తి గురించి వివరిస్తారు. ఊరిలోని ఆలయ సమావేశం, గ్రామసభల్లోనూ సోధి వీరే పాటలు పాడుతుంటుందని గ్రామస్థులు ఈటీవీ భారత్​కు చెప్పారు. మ్యూజిక్ టీచర్ కావాలనేది సోధి వీరే జీవిత లక్ష్యమని, ఆమెకు సంగీతపరంగా మరింత శిక్షణ అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఉన్నతాధికారులు సహకారాన్ని అందించాలని వారు కోరారు.

Sukma Lata Mangeshkar Sodhi Veere Story
పాటలు పాడుతున్న సోధి వీరే (ETV Bharat)

దేవుడే ఆమె ద్వారా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది : గ్రామస్థుడు
'సోధి వీరే భక్తి పాటలు పాడుతుంటే, దేవుడే ఆమె ద్వారా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. మా ఊరిలో జరిగే ప్రతీ పెద్ద కార్యక్రమంలోనూ ఆమె తప్పకుండా పాటలు పాడుతుంటుంది. మా అందరిలో భక్తిభావాన్ని పెంచుతుంది. సోధి వీరే పాటలు విని మాలోని భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆమెకు ప్రభుత్వం చేయూతను అందించాలి. వారి కుటుంబాన్ని ఆదుకోవాలి' అని పోలంపల్లి గ్రామస్థుడు మాధవ్ భీమా అన్నారు.

Sukma Lata Mangeshkar Story
సోధి వీరే (ETV Bharat)

నా కుమార్తె ఫేమస్ అయినందుకు గర్వంగా ఉంది : సోధి తండ్రి
'నా కూతురు సోధి వీరే చిన్నప్పుడే కంటి చూపు కోల్పోయింది. మా చేతిలో డబ్బుల్లేక అప్పట్లో సరైన చికిత్స చేయించలేకపోయాం. దేవుడు ఆమెకు కళ్లకు బదులుగా గొంతును బహుమతిగా ఇచ్చాడు. అందుకే సోధి వీరే అద్భుతంగా పాటలు పాడుతోంది. కంటిచూపు లేకపోయినా, ఆమె ఎప్పుడూ ఎవరిపైనా ఆధారపడదు. ప్రతీ పనిని స్వయంగా చేసుకుంటుంది. నా కుమార్తె పాటల ద్వారా సుక్మా జిల్లాలో ఫేమస్ అయినందుకు గర్వంగా ఉంది' అని సోధి వీరే తండ్రి సోధి లక్కా తెలిపారు.

Sukma Lata Mangeshkar Story
సోధి వీరే తండ్రి (ETV Bharat)

'మ్యూజిక్ టీచర్ అవుతా'
'మా ఊరి వాళ్లు నన్ను సుక్మా లతా మంగేష్కర్ అని పిలుస్తుంటారు. నాది అంత పెద్ద స్థాయి కాదు. లతా మంగేష్కర్ ముందు నేను చాలా చిన్నదాన్ని. నా ప్రతిభకు ప్రభుత్వం మద్దతు, శిక్షణ అవసరం. మ్యూజిక్ టీచర్ కావాలనేది నా జీవిత లక్ష్యం. నా గొంతుక ద్వారా ఇతరులకు మనశ్శాంతిని అందిస్తున్నందుకు సంతోషంగా, సంతృప్తిగా ఉంది' అని సోధి వీరే చెప్పారు.

కలాం మాటలతో రైతుగా మహిళా- సేంద్రీయ వ్యవసాయంతో లాభాలు- కరువు ప్రాంతాల్లో సాగు విప్లవం

డబ్బులేక చదువుకు గుడ్ బై- అత్తవారింట్లో కష్టాలు- కట్​ చేస్తే పెద్ద పోలీస్ ఆఫీసర్​ జాబ్- అంజు యాదవ్ సక్సెస్ స్టోరీ ఇదే!