BJP On WAQF Act Implementation : వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని రాష్ట్రాలు నిరాకరించలేవని బీజేపీ స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై ఇండియా కూటమి పార్టీల వైఖరి తీవ్రమైన ఆందోళన కలిగించే విషయంగా అభివర్ణించింది. ఆ పార్టీలు అధికారంలో కొనసాగితే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని విమర్శించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని పలు విపక్ష పాలిత రాష్ట్రాలు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ఈ వ్యాఖ్యలు చేసింది.
విపక్షాలపై విమర్శలు
తమకు షరియా చట్టమే మొదట వచ్చిందని, ఆ తర్వాతే రాజ్యాంగమని ఝార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, రాష్ట్ర మంత్రి హఫీజుల్ హసన్ వ్యాఖ్యానించారు. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్, బంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రాల్లో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో వక్ఫ్ చట్టాన్ని నిరంతరం వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలపై కమలం పార్టీ విమర్శలు గుప్పించింది.
'రాజ్యాంగం పట్ల వారికి గౌరవం లేదు'
వక్ప్ చట్టంపై విపక్ష పార్టీ నేతల వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడమేనని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాన్షు త్రివేది అభిప్రాయపడ్డారు. "73, 74వ రాజ్యాంగ సవరణల తర్వాత కేంద్రం, రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రభుత్వాల అధికారాలు స్పష్టంగా తెలిశాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టాన్ని ఏ జిల్లా పంచాయతీ ఆపలేదు. కేంద్రం (పార్లమెంట్) ఆమోదించిన చట్టాన్ని ఏ రాష్ట్రం కూడా నిరాకరించకూడదు. వక్ఫ్ సవరణ చట్టంపై విపక్షాల వ్యాఖ్యలు రాజ్యాంగం పట్ల వారికి గౌరవం లేదని తెలియజేస్తున్నాయి. వారు రాజ్యాంగాన్ని తమ జేబుల్లో ఉంచుకుంటారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాజ్యాంగాన్ని గుండెల్లో ఉంచుకుంటుంది. ఇది రాజ్యాంగాన్ని జేబుల్లో, గుండెల్లో ఉంచుకునేవారికి మధ్య పోరాటం. కాంగ్రెస్ హయాంలోనే 73, 74వ సవరణలు ఆమోదం పొందాయి. వీటిని అప్పట్లో విప్లవాత్మకమైనవిగా అభివర్ణించారు. నేడు వారు తమ సొంత ప్రభుత్వం ఆమోదించిన సవరణలను వ్యతిరేకిస్తున్నారు." అని స్పష్టం చేశారు.
'బీజేపీకి రాజ్యాంగమే గొప్పది'
కేంద్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే సవరించిన వక్ఫ్ చట్టాన్ని గంటలోపు రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలను త్రివేది తీవ్రంగా ఖండించారు. అలాగే కర్ణాటక, ఝార్ఖండ్ మంత్రులు చేసిన వ్యాఖ్యలకుగానూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారిపై ఏ చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్, ఇండియా కూటమికి రాజ్యాంగం కంటే షరియా చట్టమే గొప్పదని భావిస్తున్నట్లు స్పష్టమవుతోందని తెలిపారు. బీజేపీకి రాజ్యాంగమే అత్యున్నతమైనదని వెల్లడించారు.
ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్
రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌కు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శత్రువులని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై త్రివేది స్పందించారు. రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి అంబేడ్కర్‌ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే ఓడించిందని మండిపడ్డారు. బాబా సాహెబ్ శత్రువు ఎవరో, అతడిని ఎన్నికల్లో ఓడించింది ఎవరో తెలుసుకోవడానికి వాస్తవాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అంబేడ్కర్ తన మొదటి ఎన్నికల్లో 74,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. అయితే ఆ ఎన్నికల్లో 75వేల ఓట్లు చెల్లవని ప్రకటించారని అన్నారు. దీంతో 1952 ఏప్రిల్‌లో ఆయన ఎన్నికల మోసానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు వెల్లడించారు.
'రాజకీయ ఒత్తిళ్లు వల్లే మమత అలా'
మరోవైపు, వక్ఫ్ సవరణ బిల్లును తమ రాష్ట్రంలో అమలు చేయబోమని బంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై త్రివేది మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లు వల్లే మమత వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఎంసీ ప్రభుత్వాన్ని ఆరాచక శక్తులకు తాకట్టు పెట్టారని విమర్శించారు. మమతా బెనర్జీ చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదని, ఆమె వ్యాఖ్యలు దేశానికి చాలా ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు. టీఎంసీ పాలనలో బంగాల్ అరాచకం వైపు పయనిస్తోందని ఆరోపించారు.