పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్- టూరిస్టులు లేక కశ్మీర్ వెలవెల- రోడ్డున పడ్డ ఫ్లోటింగ్ హౌస్ బోట్ల యజమానులు!
కశ్మీర్లో తగ్గిన పర్యటకుల సందడి- ఇబ్బంది పడుతున్న వ్యాపారులు

Published : September 20, 2025 at 12:32 PM IST
Srinagar Floating House Boat Struggles: పర్యటకులు రాకపోవడంతో కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నీటిపై తేలియాడే హౌస్ బోట్లు వెలవెలబోతున్నాయి. నిరంతరం సందడిగా కనిపించే విలాసవంతమైన హౌస్ బోట్లు టూరిస్టుల సందడి లేక మూగబోయాయి. శ్రీనగర్‌లోని నైజీన్ సరస్సులో నీటిపై తేలియాడే హౌస్ బోట్లలో గాఢమైన నిశబ్దం నెలకొంది. ఒకప్పుడు సందడిగా కనిపించే ప్రదేశం సందర్శకుల లేక ఒంటరైపోయినట్లు కన్పిస్తోంది. అందుకు గల కారణాలేంటి? ఎందుకు పర్యటకులు రాక తగ్గింది? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఆ దాడి వల్లేనా?
ఈ ఏడాది ఏప్రిల్ పహల్గాంలో అమాయక పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి కశ్మీర్లో టూరిస్టుల సందడి తగ్గింది. ఇదే విషయంపై నైజీన్ సరస్సుపై ఉన్న ప్రసిద్ధ హౌస్ బోట్ యజమాని మహ్మద్ యాకూబ్ దునూ ఆందోళన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాదాపు 800 హౌస్ బోట్లు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. అందులో మహ్మద్ యాకూబ్ ది ఒకటి.
వెలవెలబోయిన టూరిస్ట్ ప్లేస్
దాల్ సరస్సు, ప్రక్కనే ఉన్న నైజీన్ సరస్సుపై నీటిపై తేలియాడే హౌస్ బోట్లు చాలా అందంగా ఉంటాయి. అవి జలాల లోపల సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి. కళాత్మక నైపుణ్యాలు, సంస్కృతిని ప్రదర్శిస్తాయి. కానీ ఐదు నెలల క్రితం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత అక్కడికి టూరిస్టుల రాక తగ్గింది. పర్యటకుల రాకపోకలు తగ్గిపోవడంతో హోటళ్లతో పాటు ఐకానిక్ హౌస్ బోట్లు కూడా వెలవెలబోయాయి.

మహ్మద్ యాకూబ్ దునూకు చెందిన విలాసవంతమైన హౌస్ బోట్లు నైగీన్ సరస్సులో ప్రసిద్ధి చెందాయి. ఎందుకంటే అవి గత 109 ఏళ్లుగా విదేశీ, దేశీయ పర్యటకులకు సేవలు అందిస్తున్నాయి. కానీ 10 గదులతో కూడిన వారి మూడు హౌస్ బోట్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది. "ఏప్రిల్ 22 నుంచి మా హౌస్ బోట్లో ఒకే ఒక బుకింగ్ నమోదైంది. గత నెలలో ఒక రాత్రి బస కోసం పుణె, బెంగళూరు నుంచి ఏడుగురు పర్యటకులు వచ్చారు. కానీ వారికి సాధారణ ఛార్జీనే వసూల్ చేశాం. అల్పాహారం, రాత్రి భోజనంతో సహా కేవలం రూ. 12,000 మాత్రమే తీసుకున్నాం. 1990లలో ఉగ్రవాదం సమయంలో కశ్మీర్లో విదేశీ పర్యటకులను కిడ్నాప్ చేసినప్పుడు కూడా, ఇలాంటి ఇబ్బందులు నేను అనుభవించలేదు." అని మహ్మద్ యాకూబ్ పేర్కొన్నారు.
"హౌస్ బోట్ యజమానులకు, వారి సంస్థల ఉనికికి ఈ పరిస్థితులు చాలా ప్రమాదకరం. ప్రతి హౌస్ బోట్‌కు నీటిపై తేలుతూ ఉండటానికి వార్షిక నిర్వహణ అవసరం. ముఖ్యంగా దిగువన లీక్‌లను నిరోధించడానికి కాలింగ్ అవసరం. దీనికి కనీసం 1,20,000 అవసరం అవుతుంది. మేము మా కుటుంబాలను పోషించడానికే ఇబ్బంది పడుతున్నాం. హౌస్ బోట్ల మెయింటెనెన్స్ తర్వాతి విషయం. నా ఇద్దరు పిల్లల పాఠశాల ఫీజు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. స్కూల్ ఫీజు కట్టలేక పిల్లల్ని ఒక నెలపాటు పాఠశాలకు పంపలేదు. కానీ ప్రిన్సిపల్ ఉదారంగా వ్యవహరించి ఫీజు వద్దన్నారు."
--మహ్మద్ యాకూబ్, హౌస్ బోట్ల యజమాని
మరోవైపు, టూరిస్టుల రాక తగ్గడంపై కశ్మీర్ హౌస్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఛైర్మన్ మంజూర్ అహ్మద్ పక్తూన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సీజన్లో సందర్శకులు తిరిగి వస్తారని ఆశిస్తున్నామని, కానీ బుకింగ్‌లు లేవన్నారు. 3000 గదుల్లో కేవలం 40 మాత్రమే బుక్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, సిబ్బందిని తొలగించామని వెల్లడించారు. మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి పర్యటక రంగంపై తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించిందని కశ్మీర్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
పర్యటకులు ఇప్పుడు లోయలో ప్రయాణించడంపై సందేహాస్పదంగా ఉన్నారన్నారు. "చాలా సంస్థలు లాభాలు ఆర్జించలేకపోతున్నందున తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. గత మూడేళ్లుగా పర్యాటక రంగంలో ముఖ్యంగా పెద్ద హోటళ్లలో భారీ పెట్టుబడులు వచ్చాయి. కానీ పర్యటకులు లేకపోవడంతో వ్యాపారులు ఇప్పుడు నెలవారీ ఈఎంఐలు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారు" అని ఫరూక్ అహ్మద్ స్పష్టం చేశారు.

