Social Boycott In Chhattisgarh : ఆధునిక యుగంలోనూ కొందరు వ్యక్తులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. గ్రామ సర్పంచ్, ఊరిపెద్దలు కలిసి ఏడు కుటుంబాలకు చెందిన 50 మందిని సామాజికంగా బహిష్కరించారు. వారితో ఎవరూ మాట్లాడొద్దని, లావాదేవీలు జరపొద్దని పేర్కొంటూ డప్పుతో ఊరంతా చాటింపు వేయించారు. సామాజిక బహిష్కరణకు గురైన వారి పేర్లు, కుటుంబాల వివరాలతో వీడియో తీయించి సోషల్ మీడియాలో వైరల్ చేయించారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
డప్పుతో చాటింపు వేయించి మరీ
కబీర్ధామ్ జిల్లా లోహారా బ్లాక్ పరిధిలో ఉన్న సింఘన్ గడ్ గ్రామం అది. ఈ ఊరిలో సర్పంచ్, కొందరు గ్రామపెద్దల అండతో ఒక పేకాట క్లబ్ నడుస్తోంది. దాని నుంచి క్రమం తప్పకుండా వారికి మామూళ్లు అందుతున్నాయని బాధితులు ఆరోపించారు. గ్రామంలోని యువత బతుకులను కాపాడేందుకు ఈ పేకాట క్లబ్‌ను మూసేయాలని పలువురు స్థానికులు సర్పంచ్‌ను కోరారు. ఈ విషయంపై తనకు విన్నపం చేసిన వారిని సర్పంచ్ టార్గెట్‌గా ఎంచుకున్నారు.
కొన్ని రోజుల తర్వాత పలువురు గ్రామపెద్దలతో భేటీ అయ్యారు. అనంతరం సంచలన ప్రకటన చేశారు. 'సింఘన్గడ్ గ్రామంలోని 7 కుటుంబాలకు చెందిన 50 మందిని సామాజికంగా బహిష్కరిస్తున్నాం' అని సర్పంచ్ వెల్లడించారు. వారితో ఎవరైనా మాట్లాడినా, ఆర్థిక/సరుకుల పరమైన లావాదేవీలు జరిపినా రూ.1000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో గ్రామస్థుల్లో భయం పెరిగిపోయింది. ఆ 50 మంది వైపు చూసేందుకు కూడా వాళ్లు జంకారు. ఈ పరిస్థితుల్లో 50 మంది బాధితులు కలిసి పోలీసులను ఆశ్రయించారు. వారంతా కలిసి వెళ్లి కబీర్ ధామ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని వారికి ఏఎస్పీ హామీ ఇచ్చారు.
'కక్షతోనే మాపై సామాజిక బహిష్కరణ'
ఈ మొత్తం వ్యవహారానికి ఒకే వ్యక్తి ప్రధాన కారకుడు విద్యా సింగ్ ధ్రువ్ అనే వ్యక్తి అని మాజీ సర్పంచ్ భగవానీ సాహూ అంటున్నారు. 'ఆయుర్వేద ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా చేస్తున్న విద్యాసింగ్, మా ఊరిలో మొత్తం రాజకీయ నాటకాన్ని అతడే ఆడిస్తున్నాడు. కొందరు గ్రామపెద్దలు ఊరిలో పేకాట క్లబ్బును నడిపిస్తున్నారు. దాన్ని తీసేయాలని మాలాంటి వాళ్లు సర్పంచ్‌ను కోరారు. దీంతో మాపై కక్ష పెంచుకున్న సర్పంచ్ సామాజిక బహిష్కరణ చేశారు. ఇదంతా ఏకపక్ష నిర్ణయం. ఇప్పుడు ఊరిలో ఎవరూ మాతో మాట్లాడటం లేదు. లావాదేవీలు జరపడం లేదు. దీంతో మానసికంగా కుమిలిపోతున్నాం. సామాజిక బహిష్కరణకు గురైన వారి వివరాలను సోషల్ మీడియాలో వైరల్ చేయించడం మరీ దారుణం' అని సామాజిక బహిష్కరణకు గురైన మాజీ సర్పంచ్, ప్రస్తుత గ్రామ వార్డు సభ్యులు భగవానీ సాహూ తెలిపారు.
'తప్పకుండా చట్టప్రకారం చర్యలు చేపడతాం'
బాధిత కుటుంబాల నుంచి మేం ఫిర్యాదును తీసుకున్నామని కవార్ధా పట్టణ ఏఎస్పీ పుష్పేంద్ర కుమార్ బఘేల్ తెలిపారు. 'తప్పకుండా చట్ట ప్రకారం అన్ని చర్యలు చేపడతాం. మేం ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఎవరు ఇలా చేశారు ? ఎందుకు చేశారు ? అనేది తెలుసుకుంటాం' అని పుష్పేంద్ర కుమార్ చెప్పారు.
ఇన్‌స్టాలో తగ్గిన ఇద్దరు ఫాలోవర్స్- భర్తపై భార్య పోలీస్ కంప్లైంట్- చివరకు ఏమైందంటే?
గ్రాండ్‌గా మండపానికి వచ్చిన వరుడు- అడ్రస్ ఫేక్, వధువు ఫోన్ స్విచ్చాఫ్- పెళ్లి పేరుతో నయా మోసం!