ఆ ఊరిపైకి పాముల దండయాత్ర- వరండాలు, బాత్‌రూంలో మకాం- 4 రోజుల్లో 25 సర్పాలు పట్టివేత- ఎందుకిలా?
పాముల స్వైరవిహారం- వణికిపోతున్న కరయాలం మొట్ట- అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న గ్రామస్థులు

Published : June 29, 2025 at 1:00 PM IST
Massive Snakes Spotted in Village : కొండ చిలువలు, నాగు పాములు, రక్త పింజరలు ఆ ఊరి ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో ఆ గ్రామంలోని పలు ఇళ్లలో దాదాపు 25 పాములు దొరికాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఇంట్లోకి పాములు వస్తాయోననే భయంతో దాదాపు పది కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కేరళలోని కన్నూర్ జిల్లా కరయాలం మొట్ట గ్రామస్తులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జీవిస్తున్న వైనంపై ‘ఈటీవీ భారత్’ కథనమిది.
పాములు గుడ్లు పెట్టే సీజన్‌లో దడ
కరయాలం మొట్ట గ్రామం చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి. అంతేకాదు ఈ ఊరికి 4.5 కి.మీ దూరంలోనే పరస్సిని కడవు స్నేక్ బ్రీడింగ్ సెంటర్ ఉంది. అందుకే ఏటా మే మొదటి వారం నుంచి వర్షాకాలం సీజన్ ముగిసే వరకు కరయాలం మొట్ట గ్రామంలో డేంజర్ బెల్స్ మోగుతుంటాయి. ఆ టైంలోనే ఎందుకు అంటే ఆ వ్యవధిలో పాములు గుడ్లను పెడుతుంటాయి. కరయాలం మొట్ట గ్రామం చుట్టూ ఉన్న అడవుల్లో పాములు పెద్దసంఖ్యలో గుడ్లు పెడతాయి. ఒక్కో పాము 30 నుంచి 60 దాకా గుడ్లు పెడుతుంది. ఈక్రమంలోనే గుడ్లు పెట్టేందుకు సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ, ఎలుకలను వేటాడేందుకు కొన్ని పాములు కరయాలం మొట్ట గ్రామంలోని పలు ఇళ్ల వరండాలు, బాత్ రూంలలోకి ప్రవేశిస్తుంటాయి. ఈవిధంగా గుడ్లు పెట్టేందుకు వచ్చిన 25 పాములనే ఇటీవలే పట్టుకున్నారు. గత సంవత్సరం కూడా ఇదే సీజన్‌లో ఊరిలో దాదాపు 40 పాములను పట్టుకున్నారు.
అదంతా షరా మామూలుగా మారిపోయింది
పాములు కనిపించగానే వాటిని బకెట్లతో మూసివేయడం, వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడం కరయాలం మొట్ట గ్రామస్తులకు అలవాటైపోయింది. ఈ పాములను స్వాధీనం చేసుకొని, అడవుల్లో కాస్త దూరంగా విడిచిపెట్టడం అటవీ అధికారులకు షరా మామూలుగా మారింది. పాముల నుంచి తమను కాపాడేందుకు ఏదైనా శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపాలని అటవీ అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు. అయితే ఆ పాములు చాలావరకు విషపూరితమైనవి కావని, అవి గుడ్లు పెట్టేందుకు మాత్రమే ఊరిలోకి వస్తున్నాయని అటవీ అధికారులు అంటున్నారు.
పాములకు చెక్ పెట్టేందుకు వికర్షక మొక్కలు- నిపుణులు ఏమంటున్నారు?
పాములు తమ ఇళ్ల వైపు రాకూడదనే ఉద్దేశంతో కొందరు కరయాలం మొట్ట గ్రామస్తులు వరండాలలో పలు ప్రత్యేక మొక్కలను పెంచుతున్నారు. అవి పాములకు సహజ వికర్షకాలుగా ఉంటాయని నమ్ముతున్నారు. అయితే ఇలాంటి మొక్కలను తాకితే పాములకు అలర్జీలు కలుగుతాయని సమీపంలోని పరస్సిని కడవు స్నేక్ బ్రీడింగ్ సెంటర్ అధికారి అమల్జిత్ తెలిపారు. వికర్షక మొక్కలు, కర్పూరం, కిరోసిన్, వెల్లుల్లి వంటి వాటితో ఇళ్లలోకి పాముల చొరబాటును అడ్డుకోవడం అసాధ్యమని, వాటితో తాత్కాలిక ఉపశమనమే కలుగుతుందని ఆయన చెప్పారు. ఆహార వ్యర్థాలను ఇళ్ల వరండాల్లో, చెత్తకుప్పల్లో ఉంచితే అక్కడికి ఎలుకలు చేరుతాయని, ఆ ఎలుకలను తినేందుకు యత్నించే పాములే ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయన్నారు. ఎలుకలను తగ్గించే ప్రయత్నం చేస్తే పాముల బెడద చాలావరకు తగ్గిపోతుందని అమల్జిత్ అన్నారు.
పాముల గూడ్లను తొలగించడం ఒక్కటే పరిష్కార మార్గం : అమల్జిత్, అధికారి, పరస్సిని కడవు స్నేక్ బ్రీడింగ్ సెంటర్
‘‘కరయాలం మొట్ట గ్రామం చుట్టూ అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లోనే పెద్దసంఖ్యలో పాముల గూడ్లు, పుట్టలు ఉన్నాయి. తొలుత వాటిని తొలగించే చర్యలు చేపట్టాలి. అప్పుడే ఈ ఊరికి ఏటా వర్షాకాలంలో పాముల బెడద తప్పుతుంది. చాలావరకు పాములు గుడ్లు పెట్టేందుకే కరయాలం మొట్టలోని ఇళ్లలోకి చొరబడుతున్నాయి. అవి గుడ్లను పెట్టి వెళ్లిపోతాయి. ఇక తిరిగి రావు. పాములు చాలా వెరైటీ జీవులు. అవి తమ పిల్లలను పెంచవు. కనీసం తమ గుడ్లను కూడా కాపాడుకోవు. ఒక్కో పాము 30 నుంచి 60 దాకా గుడ్లు పెడుతుంటుంది. వాటిలోనే ఏదో ఒక గుడ్డు దెబ్బతినకుండా మిగిలిపోతుంది. దాని నుంచి పాము పిల్ల పుట్టుకొస్తుంది’’ అని కేరళలోని పరస్సిని కడవు స్నేక్ బ్రీడింగ్ సెంటర్ అధికారి అమల్జిత్ పేర్కొన్నారు.
పాముల భయంతో ప్రశాంతంగా నిద్రపట్టడం లేదు : ప్రదీపన్, కరయాలం మొట్ట గ్రామస్థుడు
‘‘పాముల భయంతో మా ఊరి ప్రజలకు ప్రశాంతంగా నిద్రపట్టడం లేదు. గత నాలుగు రోజుల్లో 10 ఇళ్లలో 25 పాములు దొరికాయి. వరండాలు, బాత్‌రూంలలోకి పాములు ప్రవేశిస్తున్నాయి. దీంతో వాటిలోకి వెళ్లాలంటేనే భయమేస్తోంది. గతేడాది కూడా మా ఊరిలో 40 దాకా పాములను పట్టుకున్నాం. ఈ సమస్య నుంచి మాకు ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపించాలి’’ అని కరయాలం మొట్ట గ్రామానికి చెందిన ప్రదీపన్ చెప్పుకొచ్చాడు.
ఉత్తర కాశీలో క్లౌడ్ బరస్ట్- 9మంది మిస్సింగ్- చార్‌ధామ్ యాత్ర 24 గంటల పాటు నిలిపివేత!
పోలీసుల వినూత్న ఆలోచన- రోజుకు 6.5లక్షల లీటర్ల నీరు రీసైక్లింగ్- ఆ వాటర్‌తో మినీ ఫారెస్ట్ ఏర్పాటు!

