Ayodhya Ram mandir Trust Receives Threat Mail : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య శ్రీరాముడికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో భద్రత సిబ్బందిని పెంచి పహారా కాస్తున్నారు. అయితే, దీనిపై ఆలయ అధికారులు, పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడీకి ఆదివారం రాత్రి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్ తమిళనాడు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మాట్లాడిన ఓ సీనియర్ పోలీస్ అధికారి, విచారణ చేస్తున్నట్లు తెలిపారు. రాముడి ఆలయానికి ప్రమాదం ఉన్నట్లు ట్రస్ట్‌కు అనుమానాస్పద మెయిల్ వచ్చినట్లు చెప్పారు. తమిళనాడు నుంచి ఇంగ్లీష్‌లో మెయిల్ వచ్చినట్లు వెల్లడించారు. అయితే, అధికారికంగా పోలీసులతో పాటు ట్రస్ట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అనేక సార్లు బెదిరింపులు
కాగా, అంతకుముందు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. రామ మందిరాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ ఖలీస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరించాడు. బిహార్ భగల్పుర్కు చెందిన మక్సూద్ అన్సారీ సైతం RDX పెట్టి పేలుస్తానంటూ బెదిరించాడు.
శ్రీరామ నమవికి పోటెత్తిన భక్తులు
ఇటీవలె అయోధ్యలో శ్రీరామనవమి వేడుకుల ఘనంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన రెండో శ్రీరామ నవమి కావడంతో స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠం బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీరామ నవమి రోజున ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం పడ్డాయి. దీనిని చూసిన భక్తులు పరవశించారు. ఇందుకోసం గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేందుకు మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.