ఆ ఘటనతో షాక్ అయ్యా- కానీ అది ముగిసిపోయిన అధ్యాయం: సీజేఐ జస్టిస్ గవాయ్
న్యాయవాది షూతో దాడికి యత్నం- జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందన ఇలా!

Published : October 9, 2025 at 4:34 PM IST
Attack On CJI Gavai Issue : సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు ఆ ఘటనపై జస్టిస్ బీఆర్ గవాయ్ మరోసారి మాట్లాడారు. న్యాయవాది తనపై షూ విసిరేందుకు ప్రయత్నించినప్పుడు తాను, జస్టిస్ కె వినోద్ చంద్రన్ షాక్ అయ్యామని తెలిపారు. కానీ ఆ విషయం ముగిసిపోయిన అధ్యాయమని చెప్పారు.
చాలా షాక్ అయ్యాం!
ఈ మేరకు వనశక్తి తీర్పును సమీక్షించాలని, సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ గురువారం పలు వ్యాఖ్యలు చేశారు."సోమవారం జరిగిన దానితో నా సోదరుడు (జస్టిస్ చంద్రన్), నేను చాలా షాక్ అయ్యాం. మాకు ఇది ముగిసిపోయిన అధ్యాయం" అని షూ దాడిపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడారు.
ఆయన సీజేఐ- అదేం చిన్న విషయం కాదు!
అయితే దాడికి పాల్పడిన న్యాయవాది రాకేశ్ కిశోర్‌పై చర్యలు తీసుకున్న ధర్మాసనంలో భాగమైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దానిపై తనకు సొంత అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఆయన CJI, ఇది జోక్ విషయం కాదని చెప్పారు. షూ దాడి సుప్రీం కోర్టుకు అవమానమని, తగిన చర్య తీసుకోవాలని జస్టిస్ భుయాన్ కోరారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయవాది చర్యను క్షమించరానిదిగా అభివర్ణించారు.
సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ చర్యలు
మరోవైపు, న్యాయవాది రాకేశ్ కిశోర్‌పై సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ (SCBA) చర్యలు ప్రారంభించింది. రాకేశ్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతోపాటు న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది. తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి అస్థిరమైన ప్రవర్తన కోర్టు అధికారికి పూర్తిగా తగదని తెలిపింది. వృత్తిపరమైన నీతిని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది.
పవిత్రమైన కోర్టు గది కార్యకలాపాలపై జరిగిన ప్రత్యక్ష దాడి!
సుప్రీంకోర్టు గౌరవాన్ని కూడా కాలరాయడమేనని తెలిపింది. న్యాయవాది రాకేశ్ కిశోర్ చేసిన దాడి స్వతంత్ర న్యాయవ్యవస్థపై పవిత్రమైన కోర్టు గది కార్యకలాపాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. కాగా ఘటన నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే రాకేశ్ కిశోర్ లాయర్ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అసలేం జరిగిందంటే?
ఇటీవల ఓ కేసు విచారణ సమయంలో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై లాయర్ కిశోర్ తన కాలి బూటుతో దాడికి యత్నించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై దాన్ని అడ్డుకొని ఆయన్ను బయటకు తరలించారు. ఈ క్రమంలో ఆయన సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీజేఐ వెంటనే స్పందించారు. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని తెలిపారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలు రాజకీయ పార్టీల నేతలు, న్యాయవాదుల సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.
హైకోర్టు కంటే సుప్రీంకోర్టు ఎక్కువ కాదు, తక్కువ కాదు: సీజేఐ గవాయ్
వీధి కుక్కలపై ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తాం: సీజేఐ జస్టిస్ గవాయ్

