రోడ్డు భద్రతపై శంకర్ మహదేవన్ పాట- 22 భాషల్లో త్వరలోనే విడుదల: నితిన్ గడ్కరీ
రోడ్డు భద్రతపై శంకర్ మహదేవన్ స్పెషల్ సాంగ్- 22 భాషల్లో త్వరలోనే రిలీజ్- ఈ పాటను సోషల్ మీడియాలో వైరల్ చేయండి- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపు

Published : May 28, 2025 at 7:56 PM IST
Shankar Mahadevan Road Safety Song : రోడ్డు భద్రతపై ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఒక పాటను స్వరపరిచారు. దీన్ని 22 భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. బుధవారం దిల్లీలో నిర్వహించిన 'యాత్రా కవచ్' రోడ్డు భద్రతా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు శంకర్ మహదేవన్ అద్భుతమైన పాటను స్వరపరిచారని నితిన్ గడ్కరీ కొనియాడారు. త్వరలోనే విడుదల కానున్న ఈ పాటను వీలైనంత ఎక్కువ మందికి చేర్చేందుకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికల్లో సర్క్యులేట్ చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కారులో ప్రయాణించేటప్పుడు తప్పకుండా సీటు బెల్టును ధరించాలని గడ్కరీ సూచించారు.
ఏటా 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు
గతంలో రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ కీలక గణాంకాలను విడుదల చేశారు. ఏటా భారతదేశంలో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రమాదాల్లో 1.88 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ విధంగా చనిపోతున్న వారంతా 18 నుంచి 45 ఏళ్లలోపు వారేనన్నారు. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల భారతదేశం ఏటా దాదాపు 3 శాతం జీడీపీని కోల్పోతోందని గడ్కరీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా, ఈ ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పలువురు వాహనదారులకు చట్టాలపై గౌరవం కానీ, భయం కానీ లేవన్నారు.
మెరుగైన మౌలిక సదుపాయాలతో ప్రమాదాలు తగ్గుతాయి
రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, ఎంతో మంది ప్రాణాలు నిలుస్తాయని ఉత్కర్ష్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సునీల్ బన్సల్ తెలిపారు. దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, ఆయా సదుపాయాల భద్రత, సమర్ధత కూడా మరింతగా పెరుగుతాయన్నారు.

