వందలాది వేటగాళ్లను పట్టించిన 'జీని'- పులులను సైతం కాపాడుతున్న శునకం!
వేటగాళ్లను ఏరిపారేస్తున్న శునకం- బాంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్‌లో సేవలు

Published : August 3, 2025 at 6:38 PM IST
Dog Protecting Tigers : సాధారణంగా పులులను చూస్తే ఎవరైనా భయపడతారు. అయితే వేటగాళ్లు మాత్రం దొంగచాటున వాటిపై దాడి చేసి చంపేస్తారు. అలాంటి వారి ఆట కట్టిస్తోంది ఫారెస్ట్ శాఖలో పనిచేసే ఓ శునకం. పులి, ఇతర వన్యప్రాణులను వేటాడే వారిని గుర్తించి జైలు ఊచలు లెక్కపెట్టేలా చేస్తోంది. ఇంతకీ ఆ శునకం పేరేంటి? అదేలా ప్రమాదకరమైన పులి లాంటి జంతువులను కాపాడుతోంది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్లిష్టమైన కేసుల శోధనలోనూ కీలక పాత్ర
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్ పులులకు కంచుకోట. అక్కడి పులులను చూసేందుకు పర్యటకులు ఎక్కువగా వెళ్తుంటారు. అయితే ఈ ప్రమాదకరమైన పులులకు రక్షకుడిగా షహడోల్ ఫారెస్ట్ సర్కిల్లో ఉన్న డాగ్ స్క్వాడ్ జీని ఉంది. ఈ శునకం తన కెరీర్లో వన్యప్రాణుల చంపాలని చూసిన చాలా మందిని జైలుకు పంపింది. అత్యంత క్లిష్టమైన కేసులను పరిష్కరించడంలో అటవీ శాఖకు సాయం అందించింది. జీని తెలివితేటలు, మేధస్సును చూసి అటవీ దొంగలు భయపడుతున్నారు. షహడోల్ కు చెందిన జీని అవసరమైనప్పుడు బాంధవ్ గఢ్‌లో కూడా తన సేవలను అందిస్తోంది.
'జీని చాలా తెలివైనది, చురుకైనది'
జీని అనేది షహడోల్ ఫారెస్ట్ సర్కిల్ లో పనిచేస్తున్న డాగ్ స్క్వాడ్. ఇది వన్యప్రాణులను, అడవులను వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి రక్షిస్తుంది. దీని గొప్పతనం గురించి షహడోల్ సౌత్ ఫారెస్ట్ డివిజన్ డీఎఫ్ఓ శ్రద్ధా ఈటీవీ భారత్ కు వివరించారు. "జీని షహడోల్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో చాలా ఏళ్లులో పనిచేస్తోంది. పలువురు నేరస్థులను జైలుకు పంపింది. చాలా తెలివైనది, చురుకైనది. 2019 ఏప్రిల్ 15న జీనికి భోపాల్‌లో శిక్షణ ప్రారంభమై, 2020 జనవరి 14తో ముగిసింది. తరువాత జీనీ 2020 జనవరి నుంచి షహడోల్‌లో పనిచేస్తోంది" అని శ్రద్ధా తెలిపారు.

షహడోల్ ఫారెస్ట్ సర్కిల్లో పనిచేస్తున్న జీని అనుప్పూర్, ఉమారియా జిల్లాలో మాత్రమే కాకుండా తన సేవలు అవసరమైన దగ్గరికి వెళ్తుంటుంది. ప్రస్తుతం, బాంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణులను రక్షించే బాధ్యత కూడా తన భుజాలపై వేసుకుంది. కాగా, డాగ్ స్క్వాడ్‌గా జీని బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేరస్థుల ఇబ్బందుల్లో పడ్డారు. 2020 నుంచి ఇప్పటివరకు జీని 66 కేసుల్లో నేరగాళ్లను పట్టించింది. మొత్తం 248 మంది నిందితులను అరెస్టు చేయించింది.
వేటగాళ్లకు చెక్
జీని తన పదవీకాలంలో ఇప్పటివరకు ఏడుగురు పులి వేటగాళ్లు, 12 మంది చిరుతపులి వేటగాళ్లు, పది ఎలుగు బంటి వేటగాళ్లు, 9 మంది అడవి పంది వేటగాళ్లను పట్టుకుంది. అలాగే వన్యప్రాణులను వేటాడుతున్న 17 మందిని అడ్డుకుంది. 3 ఇన్వెస్టిగేషన్లలో పాల్గొంది. జీని షహడోల్ ఫారెస్ట్ సర్కిల్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ పేరు తెచ్చుకుంది. దిండోరి ఫారెస్ట్ డివిజన్ లో ఓ చిరుతపులిని వేటాడిన కేసులో నిందితుడిని గుర్తించింది. బాంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్‌లో జీని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి తన సేవలను అందిస్తోంది. బాంధవ్ గఢ్లోని ఏడు కేసుల మిస్టరీని ఛేదించడానికి జినీ సహాయం తీసుకున్నారు అధికారులు. ఇందులో 3 కేసులను ఛేదించారు.
"షహడోల్ డాగ్ స్క్వాడ్ కుక్క జీని విజయాల శాతం చాలా ఎక్కువ. బాంధవ్ గఢ్లోని పులులను రక్షించడానికి షహడోల్ ఫారెస్ట్ సర్కిల్ నుంచి జీనిని తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బాంధవ్ గఢ్లోని డాగ్ స్క్వాడ్ ఫిట్‌గా లేదు. అది రిటైర్ అయిపోయింది. అప్పటి నుంచి జీని దాదాపు 8-10 సార్లు బాంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్‌కు వచ్చింది. క్లిష్టమైన కేసులను పరిష్కరించడంలో సహాయపడింది. జీని చాలా తెలివైన, శక్తివంతమైన శునకం" అని బాంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ పీకే వర్మ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు
షహడోల్ ఫారెస్ట్ సర్కిల్ డాగ్ స్క్వాడ్ జెనీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది. డాగ్ స్క్వాడ్ వార్షిక రిఫ్రెషర్ కోర్సులో ఇది 2023, 2025లో మొదటి ర్యాంకును పొందింది. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన జీనిని బెల్జియంలోని మాలిన్స్ నగరం నుంచి తీసుకువచ్చారు. ఈ కుక్క చాలా చురుకైనది, తెలివైనది. పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. ఈ జాతి కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. అందుకే వీటిని చాలా ప్రత్యేకమైన శునకాలుగా పరిగణిస్తారు. ఈ జాతికి చెందిన మగ కుక్కలు సాధారణంగా 24-26 అంగుళాల పొడవు, 60- 80 పౌండ్ల బరువు ఉంటాయి. ఆడ కుక్కలు దాదాపు 22-24 అంగుళాల పొడవు, 40-60 పౌండ్ల బరువు ఉండొచ్చు. ఈ జాతి కుక్కల జీవిత కాలం 10- 14 ఏళ్లు. ఇతర జాతుల కుక్కలతో పోలిస్తే ఇవి తక్కువగా రోగాల బారిన పడతాయి.

