Waqf Bill Protest in West Bengal : వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా బంగాల్ కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టి రోడ్లను దిగ్బంధించారు. ఈ ఉద్రిక్తతల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వివరించారు. ఈ ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేయడంతో హింసాత్మక వాతావారణం నెలకొంది. దీంతో ఇప్పటివరకు 110 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేశారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా జంగీపుర్‌లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోం :మమతా బెనర్జీ
మరోవైపు ఈ పరిస్థితిపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని వెల్లడించారు. అలాంటప్పుడు ఈ ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి జీవితం ఎంతో విలువైందని, రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడవద్దని కోరారు. అలాంటి వారు సమాజానికి ప్రమాదకారులని, వారిపై చట్టపమైన చర్యలు ఉంటాయని తెలిపారు. మీరంతా వ్యతిరేకిస్తోన్న చట్టాన్ని చేసింది తాము కాదని, మీకు కావాల్సిన సమాధానాలు కేంద్రాన్ని అడగాల్సిందని సూచించారు. . ఆ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేయబోమని సీఎం స్పష్టం చేశారు.
మమత ప్రభుత్వం విఫలం: బీజేపీ
కాగా, ఆందోళనలను అదుపు చేయడంలో మమత ప్రభుత్వం విఫలమయ్యిందని బీజేపీ విమర్శలు గుప్పించింది. దీనిని అదుపులోకి తీసుకురావడానికి అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవాలని టీఎంసీ ప్రభుత్వానికి సూచించింది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని, సమాజంలోని ఇతర వర్గాలలో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నాలని దుయ్యబ్టటింది. నిరసనల్లో భాగంగా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఈ దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.