హైకోర్టు కంటే సుప్రీంకోర్టు ఎక్కువ కాదు, తక్కువ కాదు: సీజేఐ గవాయ్
సుప్రీంకోర్టు, హైకోర్టు రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు- ఇవి రెండూ ఒకదానికొకటి ఎక్కువ కాదు, తక్కువ కాదు- స్పష్టం చేసిన సీజేఐ బీఆర్ గవాయ్

Published : August 15, 2025 at 3:05 PM IST
SC Not Superior Or Inferior To HC : మన రాజ్యాంగం ప్రకారం, హైకోర్టు కంటే సుప్రీంకోర్టు ఉన్నతమైనది కాదు, అలా అని తక్కువ కూడా కాదని సీజేఐ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. కనుక ఒక న్యాయమూర్తి పదవికి, నిర్దిష్ట వ్యక్తి పేరు సిఫార్సు చేయమని హైకోర్టు కొలీజియంను, సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశించలేదని ఆయన స్పష్టం చేశారు.
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎస్సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఒక కీలక ప్రతిపాదన చేశారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులను, హైకోర్టు న్యాయమూర్తుల పదవి కోసం పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి సదరు న్యాయవాదులు హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేయకపోయినప్పటికీ, వారిని న్యాయమూర్తుల పదవికి పరిగణించాలని కోరారు.
అలా సిఫార్స్ చేయలేం!
దీనిపై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, "ఫలానా వ్యక్తి పేరును న్యాయమూర్తి పదవికి సిఫార్స్ చేయమని హైకోర్టు కొలీజియంను సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశించలేదు. ఎందుకంటే, రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు- హైకోర్టు కంటే ఉన్నతమైన న్యాయస్థానం కాదు. అలా అని తక్కువ కూడా కాదు. అందువల్ల న్యాయమూర్తుల నియామకంపై హైకోర్టు కొలీజియమే మొదటగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వారు సిఫార్సు చేసిన పేర్లనే మేము పరిగణిస్తాం. అందులో సరైన అర్హత కలిగిన వారి పేర్లను సూచించమని చెబుతాం. వారు అన్నీ పరిశీలించి న్యాయమూర్తి పదవికి అర్హులైన వారి పేర్లను సుప్రీంకోర్టుకు పంపుతారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా , తన హయాంలో సుప్రీంకోర్టు కొలీజియం అభ్యర్థులతో నేరుగా సంభాషించే పద్ధతిని ప్రారంభించారు. అది నిజంగా చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. 10-15 నిమిషాలు లేదా అరగంట పాటు అభ్యర్థులతో సంభాషించిన తరువాత, వారిలో న్యాయమూర్తి పదవికి ఎవరు అర్హులో తెలుసుకోవడానికి, వారు సమాజానికి ఎంత మేరకు తోడ్పడతారో అంచనా వేయడానికి వీలవుతుంది" అని స్పష్టం చేశారు.
స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం
ఈ సందర్భంగా 1855 నాటి ఝార్ఖండ్‌లోని సంతాల్ (హుల్) తిరుగుబాటు నుంచి మహారాష్ట్రలోని జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వరకు స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాన్ని సీజేఐ గుర్తు చేసుకున్నారు. మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బీఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మాటలను ఊటంకించారు. స్వతంత్ర పోరాటంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని తెలిపారు.
మన ప్రజాస్వామ్య సమాజానికి పునాదిగా ఉండే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఆదర్శాలను ప్రోత్సహించడం, రక్షించడం న్యాయవాదులు, న్యాయమూర్తుల బాధ్యత అని సీజేఐ బీర్ గావాయ్ అన్నారు.
పాకిస్థాన్ న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదు: ఎర్రకోట వేదికపై ప్రధాని మోదీ
మోదీ మరో ఘనత- నాన్‌స్టాప్‌గా 103నిమిషాల స్పీచ్- ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్

