Manish Sisodia Bail Supreme Court : మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోదియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. సిసోదియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో దిల్లీ మనీశ్ సిసోదియా శుక్రవారం సాయంత్రం తీహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు.
VIDEO | AAP leader Manish Sisodia (@msisodia) greets party workers and supporters with 'Bharat Mata Ki Jai' and 'Inquilab Zindabad' slogans, after walking out of Tihar Jail.
— Press Trust of India (@PTI_News) August 9, 2024
" greeting to everyone, to my family that has come here, to my sisters who have been waiting for the… pic.twitter.com/SmC2wzBONe
17 నెలలుగా జైల్లోనే!
మనీశ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోదియా గత 17 నెలలుగా జైలులో ఉన్నారని, ఇంకా ఆయనపై విచారణ ప్రారంభం కాలేదని పేర్కొంది. ఈ కేసులో బెయిల్ కోరిన మనీశ్‌ను ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. 'బెయిల్ అనేది నియమం- జైలు మినహాయింపు' అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం అభిప్రాయపడింది.
సత్యానికి దక్కిన విజయం
మనీశ్ సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సత్యాన్ని దక్కిన విజయంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది. జైలులో ఉన్న పార్టీకి చెందిన ఇతర నేతలకు కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. "దిల్లీ విద్యా విప్లవ వీరుడు మనీశ్ కు బెయిల్ లభించడం వల్ల ఈ రోజు దేశమంతా సంతోషంగా ఉంది. గత 530 రోజులుగా సిసోదియాను జైల్లో ఉంటారు. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడమే మనీశ్ చేసిన నేరమా?" అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రంపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. మరోవైపు, మనీశ్ కు బెయిల్ రావడాన్ని దిల్లీ మంత్రి అతీశీ స్వాగతించారు. "ఈరోజు నిజం గెలిచింది. దిల్లీ విద్యార్థులు గెలిచారు. పేద పిల్లలకు మంచి చదువు అందించినందకే మనీశ్‌ను జైల్లో పెట్టారు" అని కేంద్రంపై అతీశీ మండిపడ్డారు.
పంజాబ్ సీఎం హర్షం
మనీశ్ సిసోదియాకు బెయిల్ లభించడాన్ని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సత్యానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. "సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి చెంపపెట్టు. మనీశ్ జీవితంలో 17 నెలలు జీవితంలో నాశనం అయ్యాయి. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ కు కూడా త్వరలోనే న్యాయం జరిగి జైలు నుంచి విడుదలవుతారని ఆశిస్తున్నాం. ఈ తీర్పు ఆప్‌కు పెద్ద బూస్ట్" అని పేర్కొన్నారు. అలాగే మనీశ్‌కు బెయిల్ లభించినందుకు సంతోషంగా ఉందని ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్ తెలిపారు. దిల్లీ ప్రభుత్వానికి మనీశ్ నాయకత్వం వహించి, బాగా పని చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
'అవి పూర్తి చేసిన వెంటనే జైలు నుంచి మనీశ్ బయటకు'
సీబీఐ, ఈడీ కేసుల్లో మనీశ్ సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆయన తరఫు న్యాయవాది రిషికేశ్ కుమార్ తెలిపారు. గత 17 నెలలుగా మనీశ్ జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టులో సుప్రీంకోర్టు పెట్టిన పూచీకత్తు వంటి షరతులను పూర్తి చేసిన తర్వాత మనీశ్ జైలు నుంచి విడుదలవుతారని వెల్లడించారు.
దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో మనీశ్ సిసోదియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అరెస్టయిన రెండు రోజుల తర్వాత మనీశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలుగా మనీశ్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల ఆయనకు ఊరట లభించింది.