Waqf Act Constitutional validity SC : పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం -2025 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఏప్రిల్ 16న విచారణ జరపనుంది. ఈ పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ముగ్గురు సభ్యులు ధర్మాసనం విచారించనుంది. ఇంతకుముందు ఏప్రిల్ 15న సుప్రీం విచారణ జరపనున్నట్లు వార్తలు వచ్చాయి.
కొత్త వక్ఫ్ చ్టటాన్ని వ్యతిరేకిస్తూ జమియత్ ఉలమాయె హింద్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఇతర ముస్లిం పక్షాల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, న్యాయవాది నిజాం పాషా పిటిషన్లు దాఖలు చేశారు. మొత్తం 10 పటిషన్లు సుప్రం కోర్టులో దాఖలు అయ్యాయి. వీటిని పరిశీలించిన సుప్రీంకోర్టు బెంచ్, వాటి అత్యవసర విచారణకు అంగీకారం తెలిపింది. ఏప్రిల్ 15 విచారించనున్నట్లు తెలిపింది.
అయితే దీనిపై కేంద్రం మంగళవారం సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో కేవియట్‌ను దాఖలు చేసింది. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయొద్దంటూ ఈ పిటిషన్ వేసింది. అంతకుముందే కేవియట్పై విచారణ జరపాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను ఏప్రిల్ 16న విచారణ చేపట్టనన్నట్లు సుప్రీం తెలిపింది.
వక్ఫ్ చట్టం అమలు
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 మంగళవారం (ఏప్రిల్ 8) నుంచే అమల్లోకి తెచ్చింది కేంద్రం. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్‌లో పాస్ అయిన వక్ఫ్ బిల్లు- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు. అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు, చట్టంగా మారింది.
'నా రాష్ట్రంలో వక్ఫ్ చట్టం అమలు చేయను!'
ఇదిలా ఉండగా, విపక్ష ఇండియా కూటమి కొత్త వక్ఫ్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటున్నాయి. బంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పేశారు.