UP Imams Connection With Pakistani Group : ఉత్తరప్రదేశ్‌లో మరో షాకింగ్ వ్యవహారం వెలుగుచూసింది. సహరన్‌పూర్ జిల్లా గంగోహ్ ప్రాంతంలోని ఒక గ్రామ మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్న వ్యక్తిని రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అదుపులోకి తీసుకుంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయనే అనుమానంతో అతడిని అరెస్టు చేశారు.
పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు నిర్వహిస్తున్న ఒక వాట్సాప్ గ్రూపులో సదరు ఇమామ్ సభ్యుడిగా ఉన్నట్లు భారత భద్రతా వర్గాలు గుర్తించాయి. ఈ వాట్సాప్ గ్రూపులో అతడు చేస్తున్న ఛాట్‌లను చాలాకాలంగా మానిటర్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే పాకిస్థానీ వాట్సాప్ గ్రూప్ నుంచి ఇమామ్ ఎగ్జిట్ అయినట్లు వెల్లడైంది. భారత భద్రతా వర్గాల నుంచి నిర్దిష్టమైన సమాచారం అందిన తర్వాతే గంగోహ్‌లోని మసీదు ఇమామ్‌ను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అరెస్టు చేసింది.
అతడు నిత్యావసరాల షాపింగ్ కోసం శుక్రవారం మధ్యాహ్నం సహరన్‌పూర్‌కు వచ్చాడు. అక్కడి నుంచి తన గ్రామానికి తిరిగి వెళ్లేందుకు టీటరోన్ అడ్డాలో బస్సు ఎక్కాడు. మార్గం మధ్యలో బస్సును ఆపిన ఏటీఎస్ అధికారులు, ఇమామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.
'నన్ను ఎవరో ఆ వాట్సాప్ గ్రూపులో చేర్చారు'
"నన్ను ఎవరో ఆ వాట్సాప్ గ్రూపులో చేర్చారు. అది పాకిస్థానీ వాట్సాప్ గ్రూప్ అని కొన్ని రోజుల క్రితమే తెలిసింది. అందుకే దాని నుంచి ఎగ్జిట్ అయ్యాను" అని ఏటీఎస్ విచారణలో ఇమామ్ చెప్పాడట. అతడు ఉన్న వాట్సాప్ గ్రూప్ హ్యాండ్లర్లు ఎవరు? పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలే దాన్ని నడిపేవా? అనేది తెలుసుకోవడానికి ఏటీఎస్ ఇప్పుడు ఇమామ్ మొబైల్ ఫోన్ రికార్డులను జల్లెడ పడుతోంది. అతడి స్మార్ట్‌ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో, ఛాట్‌లలో జిహాదీ ప్రచార సామగ్రి, భారత వ్యతిరేక భావాలు ఉన్నాయని తేలింది. పాకిస్థానీ వాట్సాప్ గ్రూపులో అతడు తరచుగా భారతదేశ భద్రతా వ్యవస్థ, మతపరమైన అంశాలు, సున్నితమైన అంశాల గురించి మాట్లాడేవాడని వెల్లడైంది.
ఇతర అనుమానితుల జాబితా సిద్ధం
సదరు ఇమామ్ పాకిస్థానీ వాట్సాప్ గ్రూపులో యాక్టివ్‌గా ఉండటమే కాకుండా, మరెంతో మందిని ఆ గ్రూపులో చేర్చడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇమామ్ పరిచయస్తుల సమాచారాన్ని, పాకిస్తానీ వాట్సాప్ గ్రూప్‌లోని ఇతర భారతీయ సభ్యుల చిట్టాను తెలుసుకునే ప్రయత్నంలో ఏటీఎస్ ఉంది. ఈ కేసుతో లింకులున్న ఇతర అనుమానితుల జాబితాను సిద్ధం చేశారు. ఇమామ్ ఆర్థిక లావాదేవీల లెక్కలన్నీ సేకరిస్తున్నారు. అతడికి అందిన అనుమానాస్పద నిధులు, విదేశీ హ్యాండ్లర్లతో ఉన్న సంబంధాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇమామ్ నుంచి మొబైల్ ఫోన్, కొన్ని పత్రాలు, ఇతర డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారతదేశంలో ఏదైనా ఉగ్రవాద నెట్‌వర్క్ చురుగ్గా పనిచేస్తోందా అనేది తెలుసుకోవడానికి వాటిని ఫోరెన్సిక్ దర్యాప్తు కోసం పంపారు.
దేశద్రోహం కేసు.. అవసరమైతే రంగంలోకి ఎన్ఐఏ
"ఇది కేవలం సైబర్ నేరం మాత్రమే కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన తీవ్రమైన సమస్య. నిందితుడి మొబైల్ ఫోన్‌లో లభించిన డేటా ఆధారంగా, మిగతా సమాచారాన్ని రాబడుతున్నారు. అవసరమైతే జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఇమామ్‌పై ఐటీ చట్టం, దేశద్రోహం, ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాం" అని ఏటీఎస్ అధికార వర్గాలు తెలిపాయి.
మొత్తం మీద అది పాకిస్థానీ వాట్సాప్ గ్రూపే అని ఏటీఎస్ అధికారులు అంటున్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి సోషల్ మీడియాను పాకిస్థాన్ వాడుతోందని తెలిపారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపుల ద్వారా భారత్‌లోని యువతను పాక్ రెచ్చగొడుతోందని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, భారతదేశంపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ ఇలాంటి యత్నాలు చేస్తోందన్నారు.
కిడ్నాప్ కేసు పెట్టిన ఇమామ్ తండ్రి
మరోవైపు ఇమామ్ తండ్రి గంగోహ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారని ఆయన ఆరోపించారు. కొంతమంది తన కొడుకును బస్సు నుంచి బలవంతంగా దింపి స్కార్పియో కారులో తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇమామ్, అతడి తండ్రికి నేర చరిత్ర ఉంది. ఇమామ్ తండ్రిపై మోసం, కుట్ర సహా అనేక కేసులు గతంలో నమోదయ్యాయి. ఇమామ్‌పై చాలా సంవత్సరాల క్రితం దాడి, బెదిరింపు వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది.
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న యువకుడి అరెస్ట్
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడనే అభియోగాలతో దేవేంద్ర సింహ్ డిల్లో అనే 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని హరియాణాలోని కైథల్ జిల్లా గుహ్లా పోలీసు స్టేషన్ పరిధికి చెందిన మస్త్‌గడ్ అనే గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. భారత సైనిక స్థావరాలు, దేశ భద్రతతో ముడిపడిన సున్నితమైన ప్రదేశాల ఫొటోలు, వీడియోలను ఇతడు సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు పంపుతున్నట్లు గుర్తించారు. గత మూడు రోజుల వ్యవధిలో గూఢచర్యం ఆరోపణలతో హరియాణాలో జరిగిన రెండో అరెస్టు ఇది.
దేవేంద్ర సింహ్ పాక్ గూఢచారిగా ఎలా మారాడు?
దేవేంద్ర సింహ్ ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాడు. అతడు 2024 నవంబరులో కర్తార్‌పూర్ కారిడార్ నుంచి నాన్‌కానా సాహిబ్ దర్శనానికి వెళ్లాడు. అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తిని దేవేంద్ర సింహ్ కలిశాడు. ఆ వ్యక్తి దేవేంద్ర సింహ్‌కు ఒక పాకిస్థానీ ఫోన్ నంబరును ఇచ్చాడు. ఆ నంబరుకు వీడియో కాల్ చేయగా, హనీ ట్రాప్‌లో దేవేంద్ర సింహ్ ఇరుక్కున్నాడు. ఈ హనీ ట్రాప్‌కు పాల్పడిన యువతి, అతడిని ఒక పాకిస్థానీ గూఢచారి ఏజెంటును పరిచయం చేసింది. నాటి నుంచి అతడితో దేవేంద్ర సింహ్ టచ్‌లో ఉంటూ భారతదేశ సైనిక రహస్యాలను అందిస్తున్నాడు. ఈ సమాచారం ఇచ్చినందుకు దేవేంద్రకు పాక్ నుంచి ఎంత డబ్బు అందింది అనేది తెలుసుకునే ప్రయత్నంలో భారత భద్రతా సంస్థలు ఉన్నాయి.
ట్విన్ సిస్టర్స్ అదుర్స్- రూపంలోనే కాదు మార్కుల్లోనూ సేమ్ టూ సేమ్
కన్న కూతురిపై తండ్రి అత్యాచారం- ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపు!