Kamal Haasan Rajya Sabha : మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ సహా తమిళనాడు నుంచి ఆరుగురు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార డీఎంకే నుంచి ముగ్గురు, ప్రతిపక్ష ఏఐడీఎంకే నుంచి ఇద్దరు, ఎంఎన్‌ఎం నుంచి కమల్ హాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పరిశీలన తర్వాత డీఎంకే, ఏఐడీఎంకే, ఎంఎన్‌ఎం సభ్యుల నామపత్రాలు ఆమోదం పొందినట్లు అధికారులు ప్రకటించారు.
ఏడుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
మొత్తం ఏడుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతీ అభ్యర్థికి సుమారు 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే స్వతంత్ర అభ్యర్థులకు ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ల విత్ డ్రాకు జూన్ 12 వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 12న రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్లు ఆ ఆరుగురికి సర్టిఫికెట్లు అందజేయనున్నారు.
అంతకుముందు శుక్రవారమే రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు కమల్ హాసన్. చెన్నై సెక్రటేరియట్లో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న న్యాయవాది విల్సన్, రుక్యయ్య మాలిక్ అలియాస్ కవిగ్నార్ సల్మా, ఎస్ఆర్ శివలింగం సైతం డీఎంకే తరఫున నామినేషన్ వేశారు. మరో ఇద్దరు అన్నా డీఎంకే నేతలు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
తమిళనాడులో త్వరలో ఖాళీ కానున్న ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఇటీవలె నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం 2025 జూలై 25న ముగియనుండడంతో జూన్ 19న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే జూన్ 2న ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూన్ 9న ముగిసింది. ఆరు సీట్లకు గానూ 3 స్థానాల్లో డీఎంకే, రెండు స్థానాల్లో అన్నా డీఎంకే, ఒక స్థానానికి డీఎంకే మిత్రపక్షమైన ఎంఎన్ఎంకు పోటీ చేశాయి.