RCB Stampede Case : 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్ అందుకున్న తర్వాత ఆర్సీబీకి సంబంధించిన విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆర్సీబీ టీమ్ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేను శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. ముంబయి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆయనను బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణకు తరలించారు.
డీఎన్‌ఏ సిబ్బంది కూడా!
మరోవైపు, విజయోత్సవ కార్యక్రమ నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది కిరణ్, సుమంత్, సునీల్ మాథ్యూను విచారణతు తరలించారు. అయితే విజయోత్సవ ఈవెంట్‌ను డీఎన్‌ఏ సంస్థతో నిఖిల్ సమన్వయం చేసుకుని నిర్వహించినట్లు తెలుస్తోంది.
పరారీలో KSCA కార్యదర్శి!
ప్రస్తుతం తొక్కిసలాటకు సంబంధించి కబ్బన్ పార్క్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ కొనసాగుతోంది. ఆర్సీబీ ప్రతినిధులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్- KSCAను నిందితులుగా చేర్చారు పోలీసులు. అయితే KSCA కార్యదర్శి, కోశాధికారి పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు వారి ఇంటికి వెళ్లినట్లు సమాచారం.
పలువురు సస్పెండ్
అయితే చిన్నస్వామి మైదాన్ సమీపంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న బి. దయానంద్‌ను, అదనపు పోలీసు కమిషనర్ వికాస్ కుమార్ వికాస్,సెంట్రల్ డివిజన్ డీసీపీ శేఖర్ టెక్కన్నవర్ తదితరులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కొత్త పోలీస్ కమిషనర్‌గా సీమంత్ కుమార్ సింగ్‌ను నియమించింది. దీంతో ఆయన గురువారం అర్ధరాత్రి కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు.
ప్రకటనలే ఘటనకు కారణమా?
కాగా, విజయోత్సవ ర్యాలీ నిర్వహణపై ట్వీట్ చేసే ముందు RCB యాజమాన్యం పోలీసులను సంప్రదించలేదని సమాచారం. ఆ తర్వాత పరేడ్‌కు అనుమతి కోసం పోలీసులను సంప్రదించగా, వారు నిరాకరించారట. కానీ అప్పటికీ ఆ ట్వీట్ ఫుల్ వైరల్ అయింది. పరేడ్‌పై చేసిన భిన్నమైన ప్రకటనలే దుర్ఘటనకు ప్రధాన కారణమంటూ జోరుగా చర్చ సాగుతోంది.
సిట్ ఏర్పాటు చేసిన హైకోర్టు
మరోవైపు, కర్ణాటక హైకోర్టు కూడా తొక్కిసలాట ఘటనను సుమోటోగా పరిగణించి విచారణ జరిపింది. ముడిపడిన కార్యక్రమాన్ని నిర్వహించటంలో వైఫల్యం ఎవరిదో తేల్చిచెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఘటనకు కర్ణాటక క్రికెట్ సమాఖ్య, ఆర్‌సీబీ ప్రతినిధులను బాధ్యులుగా పేర్కొంటూ తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది.
'విషాదం గురించి కోహ్లీకి అప్పుడు తెలియదేమో- కానీ అది చాలా బాధాకరం'
'ఒక్కడే కుమారుడు- నా బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయకండి'- తొక్కిసలాట తర్వాత ఓ తండ్రి ఆవేదన