Ramoji Rao First Death Anniversary : స్వయంకృషితో అత్యున్నత స్థాయికి చేరి, తెలుగుజాతికి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన దార్శనికుడు రామోజీరావు! మట్టి నుంచి మాణిక్యాలు సృష్టించిన కృషీవలుడు! చేపట్టిన ప్రతి పనిలో తనదైన ముద్రవేసిన కార్యసాధకుడు. అనితరసాధ్యమైన పట్టుదల, క్రమశిక్షణ, విలువలు, విశ్వసనీయతతో కూడిన ఆయన ప్రయాణం నాటికి, నేటికి, ఎన్నటికీ అనుసరణీయం. రామోజీరావు నడిచిన మార్గం మనందరికీ జీవితకాల స్ఫూర్తి పాఠం.
ఉదాత్తమైన రామోజీరావు జీవితం, ఆయన నడిచిన బాట యావత్ సమాజానికి ఒక విలువల పుస్తకం. ఆయన ఆచరించిన విలువలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న తపన ఉన్నవారికి స్ఫూర్తిమంత్రాలు. 'ఎప్పుడూ రేపటి గురించే ఆలోచించు, నిన్నటివైపు తొంగిచూడకు' అన్నది రామోజీరావు విధానం. మార్పు, ప్రగతి రెండూ కవల పిల్లలు. మార్పుతోనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి కోరుకుంటే కొత్తగా ఆలోచించు అని చెప్పేవారు. జీవితంలో ఎదగడానికి ఆకాశమే హద్దు. ఎప్పుడూ గొప్ప గొప్ప ఆలోచనలే చేస్తే ఫలితాలూ అలాగే ఉంటాయన్న రామోజీరావు మాట సదా స్మరణీయం. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, నీ బతుకు నువ్వే బతుకు. ఎవరి సాయం కోసమూ ఎదురుచూడకు అని బోధించారు. ఇతరుల చప్పట్ల కోసం కాదు, నీ అంతరాత్మను మెప్పించే పనులే చెయ్యి, విజయాలతో పాటు అంతులేని సంతృప్తీ సొంతమవుతుంది అన్నది రామోజీరావు నేర్పిన గొప్ప పాఠం.
రామోజీ జీవిత సిద్ధాంతం : సవాళ్లకు ఎప్పుడూ భయపడకూడదు అన్నది రామోజీరావు సిద్ధాంతం. సవాళ్లు కష్టాలనే కాదు, అవకాశాలనూ మోసుకొస్తాయని దృఢంగా నమ్మిన వ్యక్తి ఆయన! ఆత్మాభిమానం కంటే ఏదీ విలువైంది కాదు. కష్టాలొచ్చాయని మన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఎవరితోనూ, దేనితోనూ రాజీపడొద్దని ఉద్బోధించారు. ఆర్థికంగా మనజాలనిది ఏదైనా కాలగర్భంలో కలిసిపోతుంది. ఏ కొత్త పని మొదలుపెట్టినా ఇది గుర్తుంచుకోవాలంటూ ఆర్థికసూత్రం నేర్పించిన మేధావి. క్రమశిక్షణకు మించిన విజయ రహస్యం మరొకటి ఉండదు. అది లేనప్పుడు ఏ ప్రతిభా రాణించదని ఘంటాపథంగా చెప్పారు. వ్యక్తికైనా, వ్యవస్థకైనా నిజమైన సంపద విశ్వసనీయతే! అలాంటి విశ్వసనీయతను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పడమే కాదు, జీవితాంతం దానికి కట్టుబడిన దృఢచిత్తం రామోజీరావు సొంతం.

రామోజీరావు పాటించిన జీవనసూత్రాలు : సమాజంపై రామోజీరావుకు అమితమైన ప్రేమ! ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిత్యం తపించేవారు. జర్నలిజంలో విలువలు పాటించారు. ఆయన పట్టుదలను, సమాజంపై ప్రేమను, ప్రజల పక్షాన నిలబడాలన్న తపనను యువతరం స్ఫూర్తిగా తీసుకుంటే జీవితంలో ఉన్నతంగా ఎదగడం ఖాయం. ఆలోచనల్లో నిత్య నూతనత్వం రామోజీరావు ప్రత్యేకత. యువతరం ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలకు పెద్దపీట వేసేవారు. విషయం ఏదైనా సునిశితంగా అధ్యయనం చేయడం ఆయనకు అలవాటు. సమయపాలన, క్రమశిక్షణకు మారుపేరు.

రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి వ్యాయామం చేసేవారు. మితాహారంతో నియమబద్ధ జీవనశైలిని పాటించారు. పనిలోనే జీవితానందాన్ని అన్వేషించి, ఆస్వాదించారు. శ్రమే దైవమని విశ్వసించిన ఆయన, పనిచేస్తూనే ఒరిగిపోవాలని కోరుకున్నారు. అందుకు తగినట్లే ఆఖరి క్షణం వరకు తరగని ఉత్సాహంతో శ్రమించారు. ఈ లక్షణాలే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావును శక్తిమంతుడిగా, అక్షరయోధుడిగా మార్చాయి. రామోజీరావు పాటించిన జీవన సూత్రాలు ప్రతిఒక్కరూ నేర్చుకోదగినవి, నిత్యజీవితంలో అనుసరించదగినవి.

ఎన్నో చైతన్యోద్యమాలకు ఊపిరి : ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు మహాకవి కాళోజీ! అదే అభిప్రాయంతో కలాన్ని కరవాలం చేసి సామాజిక దురాచారాలు, దుర్మార్గాలను రామోజీరావు దునుమాడారు. పరిశోధనాత్మక పాత్రికేయంతో అవినీతిపరుల ఆటకట్టించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నో చైతన్యోద్యమాలకు ఊపిరిపోశారు. ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా బాధితుల పక్షం వహించేవారు.

వ్యాపారమంటే ధనార్జనే కాదని నమ్మిన వ్యక్తి : వ్యాపారమంటే ధనార్జనే కాదు, సామాజిక నిబద్ధత కూడా అన్నది రామోజీరావు నిశ్చితాభిప్రాయం. ప్రకృతి విపత్తులు, సంక్షోభాలు సంభవించినప్పుడు నిరాశ్రయులైన వారికి తోడు - నీడగా నిలిచారు. సమాజం నుంచి ఎదిగి వచ్చిన వారు తమవంతుగా తిరిగివ్వాలన్న అంతః సూత్రం ఇందులో దాగి ఉంది.
ఉద్యోగులకు బాధ్యతల వీలునామా : కుటుంబ సభ్యులుగా భావించే గ్రూపు సంస్థల ఉద్యోగులకు రామోజీరావు బాధ్యతల వీలునామా రాశారు. ప్రతి ఉద్యోగీ సమర్థ సైనికుడై కదలాలని, సృజనతో సవాళ్లను అధిగమించాలని సూచించారు. అన్ని విజయాల్లో తన సైన్యం మీరేనని ప్రకటించారు. తాను నిర్మించిన సంస్థలు, వ్యవస్థలు దృఢంగా కలకాలం నిలవాలంటే పునాదులు మీరేనని చెప్పారు. దశాబ్దాలుగా వెన్నంటి నిలిచి, ఆశయ సాఫల్యానికి తోడుగా నిలిచిన యావత్ సిబ్బందికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తన తదనంతరమూ సమున్నత సంప్రదాయాలు కొనసాగి, రామోజీ సంస్థల ఖ్యాతి మరింత పెంచే విద్యుక్త ధర్మానికి నిబద్ధమవ్వాలని ఉద్యోగులకు కర్తవ్యబోధ చేశారు.
తాను వెలుగుతూ ఇతరులకు వెలుగు : రామోజీరావు తాను వెలుగుతూ ఇతరులకు వెలుగులు పంచారు. ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుని తనతో పాటు మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన నడిచిన దారి, పాటించిన విలువలు సమకాలీకులనే కాదు, భావితరాలనూ ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఆయన నమ్మిన, పాటించిన విలువలను త్రికరణశుద్ధిగా కొనసాగించడమే రామోజీరావుకు అర్పించే నిజమైన నివాళి.
విశ్వంలో అక్షరం ఉన్నత వరకూ రామోజీ నామస్మరణం : ఈ విశ్వంలో అక్షరం ఉన్నంత వరకూ, శబ్ధం వినిపిస్తున్నంత వరకూ, దృశ్యం కనిపిస్తున్నంత వరకూ రామోజీరావు కీర్తి అజరామరం. రామోజీరావు కృషి అనన్య సామాన్యం. రామోజీరావు స్ఫూర్తి అనుసరణీయం. రామోజీరావు పేరు నిత్య స్మరణీయం.
రామోజీరావు - ఓ మహాగ్రంథం.. ఓ స్ఫూర్తి కేంద్రం - Ramoji Rao Quotes