Kamal Haasan Rajya Sabha : మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. చెన్నై సెక్రటేరియట్లో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న న్యాయవాది విల్సన్, ఎస్ఆర్ శివలింగం, రుక్యయ్య మాలిక్ అలియాస్ కవిగ్నార్ సల్మా సైతం డీఎంకే తరఫున నామినేషన్ దాఖలు చేశారు. మరో ఇద్దరు అన్నా డీఎంకే నేతలు రాజ్యసభకు నామినేషన్ వేశారు.
ఇటీవల తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో బుధవారం వేయాల్సిన రాజ్యసభ నామినేషన్‌ను కమల్ హాసన్ వాయిదా వేసుకున్నారు. ఈ సినిమా వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. థగ్ లైఫ్ చిత్రం గురువారం విడుదలవడంతో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
తమిళనాడులో త్వరలో ఖాళీ కానున్న ఆరు రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం 2025 జూలై 25న ముగియనుండడంతో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జూన్ 2న ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూన్ 9న ముగియనుంది. ఆరు సీట్లకు గానూ 4 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే డీఎంకే వెల్లడించింది. అందులోనే ఒక స్థానానికి మిత్రపక్షమైన ఎంఎన్ఎంకు కేటాయించింది.
2018లో కమల్ హాసన్ స్థాపించిన ఎంఎన్‌ఎం పార్టీ విపక్ష ఇండియా కూటమిలో భాగం. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ఇది మద్దతు ప్రకటించింది. ఇందుకుగాను జరిగిన ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్‌ఎం ప్రచారం చేసింది. దీంతో 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అప్పట్లో అంగీకరించింది.
'నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు'- కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు కమల్ హాసన్ లేఖ