- 50 తరాల తర్వాత గ్రామానికి తొలి ట్రాక్టర్
- ఆనందంలో ఊరి ప్రజలు
- స్వీట్లు పంచుకుంటూ సందడి
అవును మీరు చదివింది నిజమే. రాజస్థాన్లోని సిరోహి జిల్లా మౌంట్ అబూలోని ఎత్తైన గ్రామం ఉత్రాజ్‌కు 50 తరాల తర్వాత మొదటిసారిగా ట్రాక్టర్ వచ్చింది. 1400 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ గ్రామానికి ట్రాక్టర్ తీసుకురావడం అంత సులభం కాదు. కానీ గ్రామస్థుల చొరవతో ఇప్పుడు సాధ్యమైంది. ట్రాక్టర్‌ను వేర్వేరు భాగాలుగా ఊరికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అమర్చారు. మొదటిసారిగా గ్రామానికి వాహనం రావడం వల్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
900 కిలోలను భుజాలపై మోసి!
Tractor After 50 Generations : అడవులు, కొండల మధ్య ఉన్న ఉత్రాజ్ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల వాహనాలేవి అక్కడికి వెళ్లలేవు. కానీ మొదటిసారిగా ఇప్పుడు ఒక ట్రాక్టర్ చేరుకుంది. దృఢ సంకల్పంతో గ్రామస్థులు తమ భుజాలపై మోసి తమ సమస్యను అధిగమించుకున్నారు. గ్రామంలోని 50 మంది కలిసి ట్రాక్టర్‌ను మోసేందుకు వెదురుతో ఒక వస్తువు తయారు చేశారు. దాని ద్వారా 900 కిలోల ట్రాక్టర్ ఇంజిన్, భాగాలను మోస్తూ 3 కిలోమీటర్లు నడిచి గ్రామానికి చేరుకున్నారు.
ట్రాక్టర్ భాగాలు గ్రామానికి రాగానే ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. డప్పువాయిద్యాలతో ఆహ్వానించారు. మిఠాయిలు పంచుకున్నారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామానికి ఇప్పుడు ట్రాక్టర్ రావడం వల్ల, తమ వందల ఎకరాల్లో భారీగా వ్యవసాయం చేయనున్నారు గ్రామస్థులు. డీజిల్ కూడా గురుశిఖర్ నుంచి నడిచి తీసుకురావాల్సి వచ్చేది. చివరకు చాలా సంవత్సరాలకు వారి కృషి ఫలించింది.
ఆ ట్రాక్టర్‌ను అబూ రోడ్ నుంచి రూ.7 లక్షలకు కొనుగోలు చేశారు. ట్రాక్టర్‌ను కంపెనీవారు అక్కడే విడదీసి, విడిభాగాలను అందించారు. గ్రామానికి చేరుకున్న తర్వాత తిరిగి దానిని అమర్చుకునేలా చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నామని, కానీ ఇప్పుడు ట్రాక్టర్ వచ్చిందని ఉత్రాజ్ గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇక నుంచి తాము వెల్లుల్లి, బార్లీని కూడా పండిస్తామని గ్రామస్థులు తెలిపారు.