IPS అధికారి బలవన్మరణంపై రాజకీయ దుమారం- విచారణకు సిట్
పూరన్ కుమార్‌పై ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు- సిట్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు

Published : October 10, 2025 at 7:33 PM IST
IPS Officer Puran Kumar Case : హరియాణాలోని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించగా, దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. దోషులకు కఠిన శిక్ష విధించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన సంఘటనలన్నీ మూములువి మాత్రమే కాదు, ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ భూస్వామ్య మనస్తత్వానికి ప్రమాదకరమైన ఉదాహరణగా కాంగ్రెస్ వర్ణించింది.
కుల వివక్షపై దిగ్భ్రాంతి!
పూరన్ కుమార్ కేసుపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన న్యాయ విచారణ కోరుతూ కాంగ్రెస్ ఎంపీ వరుణ్ చౌదరి శుక్రవారం పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియాను కలిశారు. పంజాబ్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్‌తో పాటు వచ్చిన అంబాలా ఎంపీ వరుణ్ చౌదరి, లూథియానాలో కటారియాను కలిసి, సీనియర్ పోలీసుల చేతిలో ఐపీఎస్ అధికారి ఎదుర్కొన్న కుల వివక్షపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గులాబ్ చంద్ కటారియాకు సమర్పించిన మెమోరాండంలో వరుణ్ చౌదరి పలు వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారి బలవన్మరణం గురించి తెలిసి దేశం మొత్తం షాక్‌కు గురైందని, తీవ్రమైన చర్యకు కారణం అత్యున్నత అధికారులు చేసిన కుల వివక్ష అని ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఖర్గే విమర్శలు
దళిత, ఆదివాసీ ప్రజలపై పెరుగుతున్న నేరాలకు ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో-(ఎన్సీఆర్బీ) డేటాను ఉదహరించారు. 2013- 2023 మధ్య దళితులపై నేరాలు 46 శాతం పెరిగాయని, ఆదివాసీలపై నేరాలు 91 శాతం పెరిగాయని పేర్కొన్నారు. "హరియాణాలో ఐపీఎస్ అధికారిపై కుల వివక్ష, ఓం వాల్మీకి వేధింపులు, సీజేఐపై దాడి, బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో వృద్ధ దళిత మహిళ కమలా దేవి రాయ్‌గర్‌పై జరిగిన దారుణాలు. ఇటీవలి ఈ సంఘటనలన్నీవివిక్త సంఘటనలు మాత్రమే కాదు, ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ భూస్వామ్య మనస్తత్వానికి ప్రమాదకరమైన ఉదాహరణ" అని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు.
సిట్ ఏర్పాటు చేసిన పోలీసులు
పూరన్ కుమార్ బలవన్మరణం కేసుపై సత్వర, నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు కోసం ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు చండీగఢ్ పోలీసులు. సిట్‌కు చండీగఢ్ ఐజీ పుష్పేంద్ర కుమార్ నేతృత్వం వహిస్తారు. చండీగఢ్ ఎస్ఎస్పీ కన్వర్‌దీప్ కౌర్, ఎస్పీ సిటీ కేఎం ప్రియాంక, డీఎస్పీ చరణ్‌జిత్ సింగ్ విర్క్, ఇతర అధికారులు సభ్యులుగా ఉన్నారు. "కేసులో ఆరోపణల తీవ్రత, సున్నితత్వం దృష్ట్యా చండీగఢ్ యూటీ ఐజిపి పర్యవేక్షణలో కేసును సత్వర, నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు చేయడానికి పలువురు సభ్యులతో కూడిన సిట్‌ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ నంబర్ 156/2025 లోని అన్ని అంశాలను దర్యాప్తు చేస్తుంది. ఇందులో సాక్ష్యాల సేకరణ, సాక్షుల పరిశీలన, నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం, న్యాయ సలహా తీసుకోవడం మొదలైనవి ఉంటాయి. పూర్తయిన తర్వాత తుది నివేదికను తయారు చేస్తాయి" అంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులు.
మరోవైపు, కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారం అసంపూర్తిగా ఉందంటూ ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా నిందితులందరి పేర్లు అందులో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీ తనకు అందిందంటూ ఆమె పోలీసులకు శుక్రవారం ఓ లేఖ రాశారు. అయితే, ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారం అసంతృప్తిగా ఉందన్నారు. నిందితులందరి పేర్లు ఇందులో ప్రస్తావించలేదని, వారందరినీ చేర్చాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సరైన సెక్షన్‌లను నమోదు చేయలేదని ఆరోపించారు. తన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితులు డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్‌తో పాటు రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాల పేర్లు ప్రస్తావించకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. న్యాయమైన, పారదర్శక దర్యాప్తునకు అవసరమైన అన్ని వివరాలు అందులో ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఐఆర్‌ను సవరించాలంటూ ఆమె పోలీసులను అభ్యర్థించారు.
52 ఏళ్ల పూరన్ కుమార్ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మంగళవారం చండీగఢ్‌లోని తన నివాసంలో ఆయన రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన భార్య పలు ఆరోపణలు చేశారు. 8 పేజీల సూసైడ్ నోట్ లభించినా, ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని తెలిపారు. పోలీస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు, ఇతర అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉండటమే అందుకు కారణమంటూ ఆమె ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి రాసిన లేఖలో ఆరోపించారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్లు చండీగఢ్ పోలీసులు గురువారం రాత్రి ప్రకటించారు.

