PM Modi Independence Day Speech : దేశంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి వేసే శిక్షలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆడవాళ్లపై దాడులు చేస్తే ఉరిశిక్ష అనే తెలిస్తే, తర్వాత జరిగే పరిణామాలకు భయపడతారని వివరించారు. మహిళలపై అత్యాచారాలు, హింసాత్మక ఘటనలపై తాను నిరంతరం ఆందోళన చెందుతుంటానని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నారు. ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇలా అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకెళ్తున్నారని కొనియాడారు. దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
"ఈ రోజు ఎర్రకోట మీద నుంచి నా బాధను చెప్పాలనుకుంటున్నాను. ఒక సమాజంగా మన తల్లులు, అక్కా చెల్లెళ్లు, కూతుళ్లపై జరుగుతున్న అకృత్యాల గురించి సీరియస్ గా ఆలోచించాలి. మహిళలపై జరిగే నేరాలను త్వరితగతిన విచారించాలి. పైశాచిక చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. మహిళలపై ఆకృత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష పడుతుందనే భయం నేరస్థుల్లో రావాలి. గత కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. భారత్ ను బలమైన దేశంగా మార్చడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్ డీఏ సర్కార్ అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. గతంలో ఉన్న ఆంక్షల నుంచి విముక్తి కల్పించింది."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
VIDEO | Independence Day 2024: " as a society, we need to think seriously about the atrocities being committed against our mothers, sisters and daughters. there is an outrage in the country over this. i can feel it. country, society and state government need to take this… pic.twitter.com/P0zvCecemw
— Press Trust of India (@PTI_News) August 15, 2024
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు
భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందని ప్రధాని మోదీ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలను ఎన్డీఏ సర్కార్ చేపట్టిందని పేర్కొన్నారు. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. మధ్యతరగతి, రైతులు, గృహ కొనుగోలుదారులు, స్టార్టప్‌లు, ఎమ్ఎస్ఎమ్ఈ ఈ రంగాల అవసరాలను తీర్చడానికి బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా అవసరమని నొక్కి చెప్పారు. అలాగే గత పదేళ్లలో దేశంలో మౌలిక సదుపాయాలను పెంచేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని వివరించారు.
"ఎన్డీఏ సర్కార్ గత 10 ఏళ్లలో నాలుగు కోట్ల ఇళ్లను నిర్మించింది. మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించబోతున్నాం. వచ్చే ఐదేళ్లలో 75,000 కొత్త మెడికల్ సీట్లను సృష్టిస్తాం. నేటికీ మధ్యతరగతి వర్గాల పిల్లలు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లి రూ.కోట్లలో ఖర్చు పెడుతున్నారు. గత పదేళ్లలో మెడికల్ సీట్లను దాదాపు లక్షకు పెంచాం. దాదాపు 10 కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయం సహాయక బృందాల్లో చేరారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తుండడం చూసి గర్వపడుతున్నా. మహిళా స్వయం సహాయక సంఘాలను ఆదుకునేందుకు ఇప్పటి వరకు రూ.9 లక్షల కోట్లు అందించాం. ఇతర జీ20 దేశాలతో పోలిస్తే పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ఎక్కువ కృషి చేసింది. " అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
#WATCH | During his #IndependenceDay2024 speech, PM Modi announces, " in the next five years, 75,000 new seats will be created in medical colleges in india. viksit bharat 2047 should also be 'swasth bharat' and for this, we have started rashtriya poshan mission." pic.twitter.com/IvVLVYPGKK
— ANI (@ANI) August 15, 2024
రైతుల జీవితాలను మార్చేందుకు తీవ్రంగా కృషి
రైతుల జీవితాలను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. రసాయనాల వాడకం వల్ల నేల సారం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఎన్డీఏ సర్కార్ పలు కార్యక్రమాలను ప్రారంభించిందని వెల్లడించారు. అటువంటి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి బడ్జెట్లో కేటాయింపులను కూడా పెంచామని వివరించారు. మరోవైపు, దేశ యువత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. భారత్‌లోనే మంచి విద్యావ్యవస్థను నిర్మించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక గ్లోబల్ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాయి. వాటిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తమలో తాము పోటీ పడాలి. దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడానికి ఇదొక సువర్ణావకాశం. బంగ్లాదేశ్ లో పరిస్థితులు త్వరలో మెరుగపడతాయని ఆశిస్తున్నా. బంగ్లా అభివృద్ధికి భారత్ ఎల్లప్పుడూ సహకరిస్తుంది. పొరుగు దేశాలతో శాంతికి కట్టుబడి ఉన్నాం." అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
VIDEO | Independence Day 2024: " we have brought big reforms on ground. for the poor, middle class, deprived... for the aspirations of our youth, we choose the path to bring reforms in their lives. i want to assure the citizens of india that our commitment towards bringing reform… pic.twitter.com/V3TNy8t0R5
— Press Trust of India (@PTI_News) August 15, 2024
'సెక్యులర్ సివిల్ కోడ్ తేవాల్సి సమయం వచ్చింది'
ఈ సందర్భంగా ప్రధాని ఉమ్మడి పౌరస్మృతి గురించి ప్రస్తావించారు. 'దేశంలో ఉమ్మడి పౌరస్మృతిపై సుప్రీం కోర్టు పదే పదే చర్చలు జరిపి, పలుమార్లు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ మతపరమైంది. వివక్ష చూపుతోంది. విస్తృత స్థాయిలో దీనిపై చర్చ జరగాలి. సెక్యులర్ సివిల్ కోడ్‌ను డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మనం దానిని అనుసరించాలి. అప్పుడే దేశంలో మతపరమైన బేధభావాల నుంచి సామాన్య మానవులకు విముక్తి కల్పించగలుగుతాం' అని మోదీ అన్నారు.