PM Modi Fulfils Barefoot Admirer 14-year Pledge : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరియాణా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. మోదీ ప్రధాని కావాలని, ఆయన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానంటూ 14ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేసిన రామ్‌పాల్ కశ్యప్ అనే అభిమానిని సోమవారం కలిశారు. దీంతో ఆ అభిమానికి బూట్లు గిఫ్ట్‌గా అందజేసిన ప్రధాని మోదీ వాటిని తొడుక్కొనేందుకూ సాయం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
"ఈరోజు యమునానగర్‌లోని బహిరంగ సభ నేపథ్యంలో కైతాల్‌కు చెందిన రామ్‌పాల్ కశ్యప్‌ని కలిశాను. నేను ప్రధానమంత్రి అయిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని అతడు 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు ఆయన వచ్చి నన్ను కలిశారు. ఇలాంటి వ్యక్తుల ఆప్యాయత, ప్రేమను అంగీకరిస్తాను. కానీ, అలాంటి ప్రమాణాలు చేసే ప్రతిఒక్కరినీ నేను అభ్యర్థిస్తున్నా. మీ ప్రేమను నేను గౌరవిస్తాను. దయచేసి సామాజిక కృషి, దేశ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టండి" అని ప్రధానమంత్రి సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియోను షేర్ చేసుకున్నారు.
ఎందుకలా చేశావ్ కశ్యప్?
ప్రధాని షేర్ చేసిన వీడియోలో తెల్లటి కుర్తా-పైజామా ధరించిన కశ్యప్ అనే వ్యక్తి ప్రధాని మోదీని కలిసేందుకు చెప్పులు లేకుండా నడుస్తు వచ్చారు. ఆయనను మోదీ కరచాలనం చేస్తూ స్వాగతం పలికారు. అనంతరం ఒక సోఫాలో కూర్చొన్నాక ప్రధాని ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఎందుకు ఇంత కాలం ఇంతకాలం చెప్పుల్లేకుండా ఉన్నావ్? నిన్ను నువ్వు ఎందుకు ఇబ్బంది పెట్టుకున్నావ్? అని ప్రశ్నించారు. 14 ఏళ్లుగా తాను పాదరక్షలు లేకుండానే ఉన్నట్లు కశ్యప్ మోదీకి తెలిపారు. ఆ తర్వాత బూడిద రంగులో ఉన్న స్పోర్ట్స్ షూ ఆయనకు అందజేశారు. భవిష్యత్తులో ఇలా చేయొద్దని కశ్యప్‌కు ప్రధాని సూచించారు.
మరోవైపు దేశం కోసం పోరాడిన ఎందరినో కాంగ్రెస్ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కేరళకు చెందిన న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు చెట్టూర్ శంకరన్ నాయర్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ధైర్యవంతుడైన జాతీయవాది అయిన శంకరన్ నాయర్‌ను పక్కనపెట్టింది. హరియాణా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని ప్రతి బిడ్డ శంకరన్ నాయర్ గురించి తెలుసుకోవాలి’’ అని మోదీ తెలిపారు. హస్తం పార్టీ వారసత్వ రాజకీయాల్లోనే నిమగ్నమైపోయిందని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ కొందరు గొప్ప వ్యక్తులను నిర్లక్ష్యం చేసిందని వారిలో శంకర్ నాయర్ కూడా ఒకరని బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా మోదీ స్పందించారు.