Diamond Found In Panna : భారత్లోనే కాదు ఖండాల్లోనూ విలువైన వజ్రాలకు ప్రఖ్యాతి గాంచిన మధ్యప్రదేశ్లోని పన్నాలో మరో విలువైన వజ్రం బయటపడింది. స్వామిదిన్ పాల్ అనే కూలీ మరో ముగ్గురితో కలిసి 2024 మేలో సర్కోహా గ్రామంలో ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్వామిదిన్కు గురువారం 32.80 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ భారీ వజ్రం విలువ రూ.1.5 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో స్వామిదిన్ పాల్ రాత్రికిరాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.
'పిల్లలకు ఇళ్లు కట్టిస్తాం'
పన్నా జిల్లాలోని నారంగి బాగ్కు చెందిన స్వామిదిన్ పాల్ ఈ వజ్రాన్ని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. భారీ వజ్రం లభించడం పట్ల కూలీ స్వామిదిన్ పాల్ సంతోషం వ్యక్తం చేశాడు. నలుగురు భాగస్వాములం డైమండ్ వేలంలో వచ్చిన డబ్బుల్ని సమానంగా పంచుకుంటామని చెప్పారు. ఈ వజ్రం ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పుకొచ్చారు.
'వేలంలో వజ్రాన్ని ఉంచుతాం'
మరోవైపు, పన్నాలో ఒక్కరోజులోనే చాలా మంది అదృష్టం మారిపోతుందని కలెక్టర్ సురేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు పన్నాలో 16 వజ్రాలు దొరికాయని వెల్లడించారు. స్వామిదిన్ తన దొరికిన వజ్రం పన్నాలోని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశారని తెలిపారు. త్వరలో జరగనున్న వేలంలో దానిని విక్రయానికి ఉంచనున్నట్లు వెల్లడించారు. ఈ వజ్రం ధర రూ.కోటిపైగా ఉంటుందని అంచనా వేశారు.
వజ్రాలకు పన్నా ప్రసిద్ధి
పన్నా ప్రాంతం వజ్రాల గనులకు ప్రసిద్ధి. అనేక మంది ఆ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకుని, ప్రభుత్వ అనుమతితో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతుంటారు. గనుల్లో దొరికిన వజ్రాల్ని డైమండ్ ఆఫీస్లో డిపాజిట్ చేసి, అధికారుల సమక్షంలో వేలం వేయిస్తారు. అయితే ఆ ప్రాంతంలో ఎవరికైనా తమ పొలాల్లో ఏదైనా విలువైన వజ్రం లేదా రాయి దొరికితే ప్రభుత్వం వాటి విలువలో 12.5 శాతం వాటా ఇస్తుంది. కానీ కొంత మంది తమకు గనుల్లో దొరికిందని, ఆ వస్తువు తమదే అని వాదిస్తారు. ఒక వేళ ఈ విషయం కోర్టుకు వెళ్తే తీర్పు గని యజమానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఒక వేళ డైమండ్ దొరికిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయకుండా దాచితే వారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులు చెప్పారు.