Boeing 787 Dreamliner Details : గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం, గగనతలంలో ప్రయాణాల భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి గుర్తు చేసింది. ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను సుదూర గమ్యస్థానాలకు తీసుకెళ్లడానికి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లు అనువైనవిగా భావిస్తుంటారు. 14 ఏళ్ల క్రితం బోయింగ్ డ్రీమ్ లైనర్లు తొలిసారి సేవలు అందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం వివిధ విమానయాన సంస్థల వద్ద 1,100కిపైగా ఈ శ్రేణి విమానాలు ఉన్నాయి. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గురువారం అహ్మదాబాద్ వద్ద కూలిపోయింది. అత్యధికంగా అమ్ముడైన వైడ్ బాడీ డ్రీమ్ లైనర్ లేదా బోయింగ్ 787 ప్రాణాంతక ప్రమాదానికి గురికావడం కూడా మొదటిసారి.
ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం ప్రకారం
ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 విమానం పదకొండున్నరేళ్ల క్రితం సేవలు ప్రారంభించింది. ఇప్పటివరకు 41,000 గంటలకు పైగా ప్రయాణించింది. ప్రపంచవ్యాప్తంగా 1,148 బోయింగ్ 787 విమానాలు సేవలు అందిస్తున్నాయి. వాటి సగటు ఏజ్ 7.5 సంవత్సరాలు. ప్రస్తుతం భారత విమానయాన సంస్థలైన ఎయిరిండియా, ఇండిగో బోయింగ్ 787 విమానాలను నడుపుతున్నాయి.
బోయింగ్ విమానాలు వాడుతున్న ఎయిరిండియా
ఎయిరిండియా 34 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ల ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. 27 బోయింగ్ 787-8 ల ద్వారా డ్రీమ్ లైనర్ల ద్వారా ప్రయాణం కల్పిస్తోంది. బోయింగ్ 787-8లలో మొదటిది జులైలో రెట్రోఫిట్ కోసం వెళ్లనుంది. గతేడాది విస్తారా, ఎయిర్ ఇండియా విలీనం అయిన తర్వాత మిగిలిన ఏడు బోయింగ్ 787-9 విమానాలు ఎయిర్ ఇండియాకు సేవలు అందిస్తున్నాయి. బోయింగ్ 787 మొదటి విమానాన్ని 2013 డిసెంబర్ 14న నడిపింది.
"బోయింగ్ 787 విమానంలో 18 బిజినెస్ క్లాస్ సీట్లు, 238 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. ఇది 41,000 గంటలకు పైగా విమాన ప్రయాణాన్ని, దాదాపు 8,000 టేకాఫ్‌లు, ల్యాండింగ్ లను కలిగి ఉంది. వీటిలో గత 12 నెలల్లో దాదాపు 700 టేకాఫ్, ల్యాండింగ్‌లు ఉన్నాయి. ఎయిరిండియా అదనంగా 20 B787లను ఆర్డర్ పెట్టింది. అదనంగా 24 విమానాల ఎంపికల కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను కలిగి ఉంది. ఇండిగో నార్వేజియన్ క్యారియర్ నార్స్ అట్లాంటిక్ నుంచి బోయింగ్ విమానాలను లీజుకు తీసుకుని నడుపుతోంది. సుదూర ప్రయాణాల కోసం మొత్తం ఆరు విమానాలను లీజుకు తీసుకోనుంది" అని ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం తెలిపింది.
ఎదురుదెబ్బలు
కొన్నేళ్ల క్రితం అమెరికా పర్యవేక్షణలో ఉన్న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కొన్ని సమస్యల కారణంగా డ్రీమ్ లైనర్ల డెలివరీలను నిలిపివేసింది. కానీ గురువారం వరకు బోయింగ్ విమానం ఎటువంటి ప్రాణాంతక ప్రమాదానికి గురికాలేదు. భారత్ విషయానికి వస్తే 2013లోనే ఎయిర్ ఇండియాకు బ్యాటరీ సమస్యల కారణంగా డ్రీమ్ లైనర్లతో సమస్యలు ఎదురయ్యాయి. బ్యాటరీ సమస్యల కారణంగా అప్పటి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియా డ్రీమ్ లైనర్ల కొనుగోలుకు నిలిపివేసింది. అలాగే ఈ సమస్యలకు బోయింగ్ నుంచి ఎయిర్ ఇండియా పరిహారం పొందింది.
అత్యధికంగా అమ్ముడైన వైడ్ బాడీ విమానం
ఇటీవలి సంవత్సరాలలో అనేక ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నప్పటికీ బోయింగ్ 787 ఎక్కువగా అమ్ముడైన ప్యాసింజర్ వైడ్ బాడీ విమానం ఇదే. బోయింగ్ 787-8, 787-9, 787-10 మోడళ్లలో విమానాలు ఉన్నాయి. బోయింగ్ 787-8 విమానం ఏకబిగిన 13,530 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
బోయింగ్ వెబ్ సైట్ ప్రకారం
ఈ విమానం పొడవు 57 మీటర్లు, ఎత్తు 17 మీటర్లు. రెక్కల విస్తీర్ణం 60 మీటర్లు. ప్రపంచవ్యాప్తంగా ‘787 డ్రీమ్ లైనర్’ విమానాల్లో ఇప్పటి వరకు 100 కోట్ల మందికి పైగా ప్రయాణించారు.