Operation Sindoor Defence Forces : భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ రక్షణ దళాలను మరింత బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అత్యవసర సమయాల్లో నేరుగా కొనేలా రక్షణ దళాలకు అధికారం ఇచ్చింది. రూ.40 వేల కోట్లకు విలువైన ఆయుధాలను కొనుగోలు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అత్యవసర అధికారాల కింద ఈ కొనుగోళ్లకు ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక ఉన్నతాధికారుల సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
అత్యవసర అధికారాల కింద, రక్షణ దళాలు నిఘా డ్రోన్లు, కమికజ్ డ్రోన్లు, లాంగ్ రేంజ్ లూటరింగ్ క్షిపణులు, రాకెట్లు వంటి సామగ్రిని కొనుగోలు చేయడంపై రక్షణ శాఖ దృష్టి సారిస్తుంది. అత్యవసర అధికారాల కింద ఒప్పందాలు కుదుర్చుకుంటున్న పరికరాలను నిర్ణీత వ్యవధిలోపు బలగాలను అందిచాలని నిర్ణయించారు. గత ఐదు సంవత్సరాల్లో ఇలా కోనుగోలు కోసం కేటాయించడం ఇది ఐదోసారి. రక్షణ ఆర్థిక విభాగం, ఆర్థిక సలహాదారులతో కలిసి ఈ కొనుగోళ్లను చేస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పాక్ స్థావరాలపై దాడి చేయడానికి ఉపయోగించిన రాంపేజ్ మిసైల్ కూడా కూడా అత్యవసర కొనుగోలు అధికారాల కింద రక్షణ దళాలు కొనుగోలు చేశాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రత్యక్ష కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఉపయోగించిన హెరాన్ మార్క్2 డ్రోన్లను కూడా భారత్ ఇలానే కొనుగోలు చేసింది.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రక్షణ రంగానికి రూ.50వేల కోట్ల మేర బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేపట్టవచ్చని సంబందిథ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలు చేస్తుందని తెలిపాయి. ఈ ఏడాది రక్షణశాఖ కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. తాజాగా పెంపునకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దీంతో డిఫెన్స్‌కు కేటాయించిన నిధులు రూ. 7లక్షల కోట్లు దాటుతాయని ఆ వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిగా పీఓకే, పాక్‌లోని ఉగ్రస్థావరాలను ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ ధ్వంసం చేసింది. అది జీర్ణించుకోలేని పాక్ తర్వాత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అయితే భారత్ ధాటిని తట్టుకోలేని పాక్ వెనక్కి తగ్గటం వల్ల కాల్పులు విరమణ ఒప్పందం కుదిరింది.