Odisha Raj Festival : ఎక్కడైనా పాన్ ధర రూ.20- రూ.50 వరకు ఉంటుంది. అయితే ఒడిశాలోని ఓ ప్రాంతంలో మాత్రం పాన్ ధర ఏకంగా రూ.500గా ఉంది. రాజా పండగ సందర్భంగా అక్కడివారు పాన్‌ను తినడాన్ని సంప్రదాయంగా భావిస్తారు. అందుకే ఓ దుకాణదారుడు ప్రజల కోసం ఏకంగా 100 రకాల పాన్లను సిద్ధం చేశాడు. ఈ పాన్లపై స్పెషల్ స్టోరీ మీకోసం.
ఒడిశాలో రజా పండగ చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా ఈ పండుగ జరుపుకోవడానికి మహిళలు సెలవులు తీసుకుని గ్రామాలకు వస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ పండగ పట్టణాలకు విస్తరించింది. ఈ క్రమంలో నగరవాసులు వివిధ మూలల్లో ఉన్న షాపుల్లోని పాన్ లను తింటున్నారు. పదుల రకాల పాన్లను రుచి చూస్తున్నారు.
ఈ ఏడాది 'సోనచండి' పాన్ వెరీ స్పెషల్ : ఏటా రజా సమయంలో కొత్త రకాల పాన్ లు మార్కెట్లోకి వస్తాయి. ఈ ఏడాది కూడా కూడా ఓ స్పెషల్ పాన్ అందర్నీ ఆకర్షిస్తోంది. అదే 'సోనచండి' పాన్. దీన్ని తయారు చేయడానికి రాజస్థాన్ లోని జైపుర్ నుంచి వచ్చిన ప్రత్యేక రకరకాల సుగంధ ద్రవ్యాలను వాడుతారు. అందుకే దీని ధర రూ.500. అయినప్పటికీ ప్రజలు రాజా పండగ సందర్భంగా దీన్ని రుచి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

''ఇప్పుడు రజా పండగ సమయంలో పాన్ తినడం ఒక ఫ్యాషన్‌గా మారింది. మేం బహుమతుల కోసం కార్పొరేట్ పాన్ లను తయారుచేశాం. మాగై ఆకులు, సుగంధ ద్రవ్యాలతో పాన్లను సిద్ధం చేస్తున్నాం. బనారస్ స్పెషల్ పాన్ మా బెస్ట్ సెల్లర్. ఈ పాన్ ను 3-4 రోజులు ఉంచిన తర్వాత తినవచ్చు. అదేవిధంగా వైట్ చాక్లెట్ పాన్, డార్క్ చాక్లెట్ పాన్, మామిడి పాన్, గుప్ చప్ పాన్, పైనాపిల్ పాన్, లడ్డు పాన్, స్వీట్ పాన్, ఆయుర్వేద పాన్, మహారాజ పాన్, శతరంగి పాన్, ఫైర్ పాన్ వంటి 100 కంటే ఎక్కువ రకాల పాన్ లు మా వద్ద ఉన్నాయి. ఈ పాన్ల ధర రూ. 30తో ప్రారంభమై రూ. 1500 వరకు ఉంటాయి. ఏటా రజా పర్వదినం వచ్చినప్పుడు ప్రజలు నోటిలో ఖిలాపాన్ ముక్కతో తిరుగుతారు. దీంతో వారి పెదవులు ఎర్రగా మారుతాయి. పండగ కంటే ముందు నుంచే మా దుకాణం రద్దీగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ పాన్ ఆర్డర్ లు వచ్చాయి. ప్రజలు అడిగే విధంగా మేము పాన్ లను తయారుచేస్తాం''
- పాన్ షాప్ యజమాని రామకాంత్ సాహిబ్
వేరే రాష్ట్రాల నుంచి పాన్ తయారీకి సామగ్రి :
భువనేశ్వర్‌లోని పలు ప్రాంతాల్లో దుకాణదారులు 150కి పైగా రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి పాన్లను తయారుచేస్తున్నారు. సుగంధ ద్రవ్యాలను ప్రధానంగా దిల్లీ, బనారస్, కోల్ కతా, జైపుర్ నుంచి దుకాణదారులు తెప్పిస్తున్నారు. ఈ పాన్లను ఆన్ లైన్లో కూడా విక్రయిస్తున్నారు.
సంప్రదాయ పండగ :
రజా అనేది ఒడిశా సంప్రదాయ, జాతీయ పండుగ. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు మూడు రోజుల పాటు ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. మండు వేసవి తర్వాత రుతుపవనాలు వచ్చే సమయంలో ఈ ఫెస్టివల్‌ను చేసుకుంటారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూమాత భవిష్యత్ వ్యవసాయ కార్యకలాపాలకు తనను తాను సిద్ధం చేసుకుంటుందని (భూమాతకు రుతుస్రావం జరుగుతుందని) నమ్ముతారు అక్కడి ప్రజలు.

రజాను మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును పహిలి రజా అని, రెండో రోజును రజా సంక్రాంతి అని, మూడో రోజును భూమి దహన్ అని పిలుస్తారు. రాజా పర్వదినం సందర్భంగా ప్రతి ఇంట్లో రుచికరమైన ఆహారం, పానీయాలు తయారు చేస్తారు. ఈ పండుగను కుటుంబం, స్నేహితులు, ప్రియమైనవారితో కలిసి జరుపుకుంటారు. మహిళలు కొత్త బట్టలు ధరిస్తారు. పురుషులు లుడు, కబడ్డీ మొదలైన ఆటలు ఆడుతారు. అమ్మాయిలు డోలి వాయిస్తారు.

పాన్ ఎందుకు తింటారంటే?
రజా పర్వదినాన పాన్ తినే సంప్రదాయం పురాతనమైనది. సాధారణంగా ఈ పండుగ సమయంలో మహిళలు ఇంటి పనుల నుంచి విశ్రాంతి పొందుతారు. పిండి వంటకాలు, రుచికరమైన పదార్థాలు ఆరగిస్తారు. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. గతంలో, ప్రజలు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి పాన్ ను తినేవారు. ఇప్పుడు అలానే చేస్తున్నారు.

'పండగ మారిపోయింది' : రజా పండగ చాలా మారిపోయిందని భువనేశ్వర్‌కు చెందిన ఓ వ్యక్తి అన్నాడు. తాము చిన్నప్పుడు చూసిన పర్వదినానికి ఇప్పటికి తేడా ఉందన్నాడు. ఈ పండగ చాలా సరదగా ఉంటుందని, పూర్వం గ్రామాల్లో మేం పెద్ద చెట్లపై ఊయల ఊగేవాళ్లమని తెలిపాడు. ఇప్పుడు పార్కుల్లో, పెద్ద షాపింగ్ మాల్స్‌లోని ఊయలలో ప్రజలు ఊయలను ఊగుతున్నారన్నాడు.
హజ్ యాత్ర, బక్రీద్ పండుగ ఏకకాలంలో ఎందుకొస్తాయి? ముస్లింలకు అవి ఎందుకు ముఖ్యమైనవి?
జ్యేష్ఠ మాసంలో శివునికి ఇలా పూజ చేస్తే- యశస్సు, కీర్తి, అష్టైశ్వర్యాలు కలగడం ఖాయం!