Bengal President Rule Assembly Polls : బంగాల్లో రాష్ట్రపతి పాలనలలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయని బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముర్షిదాబాద్‌లో జరిగిన హింసతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆరోపించారు. ముర్షిరాబాద్తో పాటు సుతి, ధులియన్, జాంగిపుర్, శంషెర్గంజ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింస నేపథ్యంలో పౌరులను కాపాడటం, శాంతి నెలకొల్పడంలో ప్రభుత్వం వైఫల్యమైందన్నారు. అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తుంటే అధికార పక్షం మౌనం వహిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా ఉన్నారో అక్కడ వారిని ఓటింగ్ వేయనివ్వడం లేదు. రూలింగ్ పార్టీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే, అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రపతి పాలనలో జరగాలి"
--సువేందు అధికారి, బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు (బీజేపీ)
'హింస వెనుక జిహాదీలు!'
ఇటీవల బంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక జిహాదిస్టులు ఉన్నారని సువేందు సంచలన ఆరోపణలు చేశారు. "ఉన్మాదంగా ప్రవర్తించడానికి కొన్ని గ్రూపులను ప్రభుత్వం అనుమతిస్తోంది. కానీ మేము వాటిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. అందుకే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయడం గురించి ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి" అని సువేందు అధికారి అన్నారు.
చెలరేగిన హింస
బంగాల్లో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో ఇళ్లు, దుకాణ సముదాయాలు, హోటళ్లు కాలిపోయాయి. ఈ హింసాకాండతో వందలాది మంది భగీరథి నదిని దాటి పక్కన ఉన్న మాల్దా జిల్లాలో ఆశ్రయం పొందారని అధికారులు తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు స్థానిక యంత్రాంగం ఆశ్రయం, ఆహారాన్ని అందించిందన్నారు. వారికి పాఠశాలల్లో వసతి కల్పించిందని తెలిపారు. పడవల ద్వారా వచ్చే వారికి సహాయం చేయడానికి వలంటీర్ టీమ్‌లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం యంత్రాంగం.
'పరిస్థితి నార్మల్ అవుతోంది'
హింసాత్మక ఘటనలతో అతలాకుతలమైన ముర్షిదాబాద్‌లో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దుకాణాలు తిరిగి తెరుచుకుంటున్నాయని, పక్క జిల్లాలకు వెళ్లిన వాళ్లు తిరిగి సొంత ఇళ్లకు వస్తున్నారని వెల్లడించారు. వారు సురక్షితంగా తిరిగి వచ్చేలా పాలనా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. హింస జరిగిన ప్రాంతాల్లో పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ( లా అండ్ ఆర్డర్) జావేద్ షమీమ్ చెప్పారు. అశాంతి నెలకొల్పేలా చేసే పుకార్ల వ్యాప్తిని అడ్డుకోడం తమ ప్రధాన్యం అని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి 210మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్లు ఐజీ వెల్లడించారు.
తండ్రి, కుమారుడి దారుణ హత్య గురించి మాట్లాడిన షమీమ్, ఈ ఘటనపై ప్రత్యేక కేసు నమోదు చేస్తామని చెప్పారు. నేరస్థులను పట్టుకుంటామన్నారు. వారిని గుర్తించడానికి సమయం పడుతుందని, కానీ తప్పుంచుకోలేరని చెప్పారు. అంతేకాకుండా దుకాణాలు తిరిగి తెరవాలని, బయట జిల్లాలకు వెళ్లిన వాళ్లు తిరిగి రావాలని సోమవారం పోలీసులు బహిరంగ ప్రకటనలు చేశారు.
ప్రాణభయంతో 400 కుటుంబాలు పక్క జిల్లాకు- నది దాటుకుంటూ వెళ్లి స్కూల్లో తలదాచుకున్న బాధితులు!