National Herald Case Chargesheet : బీజేపీ సారథ్యంలోని నిరంకుశ కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే తమ పార్టీని, గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ సర్కారు తన పాపాలను కప్పిపుచ్చుకోవడానికే, నేషనల్ హెరాల్డ్ కేసును తెరపైకి తెస్తోందని విమర్శించారు. వీటన్నింటికి కాంగ్రెస్ పార్టీ బెదిరే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తూనే ఉంటామని ఖర్గే పేర్కొన్నారు. "స్పష్టమైన విజన్ లేకుండా దేశ సమస్యలకు పరిష్కారాలను చూపించలేని పరిస్థితుల్లో మోదీ సర్కారు ఉంది. బీజేపీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. అందుకే ప్రజల దృష్టిని మళ్లించే పన్నాగాలను అమలు చేస్తోంది" అని ఖర్గే ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.
"బీజేపీ సర్కారు వైఫల్యం వల్ల మన దేశ ద్రవ్యలోటు మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. దిగుమతి సుంకాలు, ట్రేడ్ వార్ గురించి ఈ ప్రభుత్వంలో ఆలోచించే నాథుడే లేడు. మాటలే తప్ప చేతలు లేవు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 2024 డిసెంబరు వరకు పెట్రోలు, డీజిల్‌లపై వివిధ పన్నుల ద్వారా కేంద్ర సర్కారు రూ.39 లక్షల కోట్లు వసూలు చేసింది. ఎల్‌పీజీ ధరలను మరో రూ.50 పెంచారు. కనీసం ఆర్థిక బలహీనవర్గాలకు రాయితీలు ఇవ్వడం లేదు. గ్రాడ్యుయేషన్ చేసి కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్న వారు దేశంలో 13 శాతం మంది ఉన్నారు. నిరుద్యోగ రేటు 10.2 శాతానికి చేరుకుంది. దేశంలోని 23 ఐఐటీల్లో 22, 25 ట్రిపుల్ ఐటీల్లో 23 జాబ్ ప్లేస్‌మెంట్లలో డౌన్ అయ్యాయి. నిట్స్‌లోనూ ప్లేస్‌మెంట్స్ 11 శాతం తగ్గాయి"
--మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఉదయం దిల్లీలోని అక్బర్‌రోడ్‌లో ఉన్న ఏఐసీసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
త్వరలోనే రాజకీయాల్లో వస్తా : రాబర్ట్ వాద్రా
హరియాణాలోని గురుగ్రామ్ ల్యాండ్ డీల్ కేసులో రెండు రోజులుగా ఈడీ విచారిస్తుండటంపై ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గాంధీ కుటుంబ మనిషిని కాబట్టే ఇలాంటి వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తోందని, ఒకవేళ బీజేపీలో ఉండుంటే పరిస్థితులు మరోలా ఉండేవని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘నేను ఇప్పటికీ సామాజిక కార్యకర్తను. 1999 నుంచే ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను. ప్రజల గొంతుకగా వ్యవహరిస్తున్నాను. ప్రజలు నన్ను రాజకీయాల్లో చూడాలని భావిస్తున్నారు. త్వరలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తాను’’ అని రాబర్ట్ వాద్రా ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు సతీమణి ప్రియాంకాగాంధీతో కలిసి దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వాద్రా వెళ్లారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఆయనను లంచ్ కోసం ఈడీ అధికారులు వదిలారు. భోజనం చేసి వాద్రా తిరిగొచ్చాక మళ్లీ విచారణ చేపట్టారు.
"నేను తప్పక రాజకీయాల్లోకి వచ్చి తీరుతాను. మార్పును సాధించి తీరుతాను. చివరకు సత్యమే గెలుస్తుంది. దర్యాప్తు సంస్థలపై దేశ ప్రజలకు నమ్మకం పోయింది. బీజేపీ నేతలను కానీ, మంత్రులను కానీ అవి అస్సలు టచ్ చేయవు. ఎప్పుడో 17 ఏళ్ల కిందటి భూ లావాదేవీపై ఈడీ అధికారులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అడిగిన ప్రశ్నలే పదేపదే అడుగుతున్నారు. 2019లో నన్ను విచారించినప్పుడు కూడా అవే ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికి ఇప్పటికే సమాధానాలిచ్చాను. గురుగ్రామ్ పరిధిలో భూమి కొనుగోలు వ్యవహారంలో హర్యానా ప్రభుత్వం నాకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఈ వేధింపులేంటి? మా అత్త సోనియాగాంధీ, బావమరిది రాహుల్ గాంధీలపైనా ఈడీ ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. మమ్మల్ని ఎంత వేధిస్తే అంతగా బలోపేతం అవుతాం"
--రాబర్ట్ వాద్రా
ఆ పత్రిక కాంగ్రెస్ సొత్తు.. రాద్ధాంతం ఎందుకు ? : డీకే శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం
"రాజకీయ దురుద్దేశంతోనే సోనియా, రాహుల్‌లను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో గాంధీ కుటుంబం అస్సలు లబ్ధి పొందలేదు. అయినా వాళ్లను వేధించడం చాలా అన్యాయం. ఛార్జ్‌షీట్‌లోని ఈడీ అభియోగాలన్నీ అవాస్తవాలే. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం సొత్తు. దీనిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు?" అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశ్నించారు.
11 ఏళ్లుగా అధికారంలో ఉన్నా.. ఆధారాలు దొరకలేదా ? : జైరాం రమేశ్, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి
"నేషనల్ హెరాల్డ్ కేసులో అన్నీ తప్పుడు అభియోగాలే ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహించే అసోసియేటెడ్ జర్నల్స్‌కు చెందిన రూ.5వేల కోట్ల ఆస్తులను యంగ్ ఇండియన్ సంస్థ తీసుకుందనే అభియోగాలు అవాస్తవాలు. గత 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా, తగిన ఆధారాలు లేకుండా బీజేపీ సర్కారు రాద్ధాంతం చేస్తోంది. కాంగ్రెస్ అంటే భయం. అందుకే మోదీ సర్కారు ఇలా వ్యవహరిస్తోంది" అని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా విమర్శించారు.
లాభాపేక్ష లేని సంస్థపై మనీలాండరింగ్ కేసా ? : పవన్ ఖేరా, కాంగ్రెస్ నేత
"1947కు ముందు నేషనల్ హెరాల్డ్ పేరు చెబితే బ్రిటీష్ వాళ్లు భయపడేవారు. 2025లో ఆ పేరుకు ఆర్ఎస్ఎస్ భయపడుతోంది. లాభాపేక్ష లేని ఆ సంస్థపై మనీలాండరింగ్ కేసు పెట్టించడం దారుణం. లాభాపేక్ష లేని సంస్థ అయినందున నేషనల్ హెరాల్డ్ ఒక్క రూపాయి లావాదేవీ కూడా చేయలేదు. దాని ఆస్తులేం బదిలీ కాలేదు" అని పేర్కొంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ట్వీట్ చేశారు.