Delhi Rains Indigo Flight Turbulence : ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారడం వల్ల దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో బలమైన గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఓ ఇండిగో విమానం గాల్లో ఉండగా తీవ్ర కుదుపులకు లోనైంది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురై కేకలు వేశారు. వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు. కానీ, వడగండ్ల ధాటికి విమానం ముందు భాగం దెబ్బతింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో 6E2142 విమానంలో 220మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మధ్యలో ప్రతికూల వాతావరణం కావడం వల్ల ఒక్కసారిగా విమానం తీవ్ర కుదుపులకు లోనయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళలతో అరుపులు, కేకలు వేస్తూ గట్టిగా సీట్లను పట్టుకున్నారు. వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్, శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు చర్యలు చేపట్టారు. చివరకు విమానం సురక్షితంగా దిగడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. విమానం కుదుపులకు లోనైప్పుడు ప్రజలు కేకలు వేస్తూ గట్టిగా సీట్లు పట్టుకున్న దృశ్యాలను ఓ ప్రయాణికుడు రికార్డ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
VIDEO | Inside visuals of Srinagar-bound IndiGo flight from Delhi that suffered mid-air turbulence due to severe weather conditions. The pilot declared an " emergency" to air traffic control in srinagar. the aircraft later landed safely and has since been grounded, officials… pic.twitter.com/v1zp1VbW9J
— Press Trust of India (@PTI_News) May 21, 2025
మరణాన్ని దగ్గర నుంచి చూసినట్లు ఉందని ఓ ప్రయాణికుడు అన్నాడు. ఆ సమయంలో నా జీవితం ముగిసిపోయిందని అనుకున్నా. అందరూ భయంతో కేకలు వేస్తున్నారు. సేఫ్‌గా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు. పైలట్ మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చారు. అందుకు హ్యాట్స్ ఆఫ్. మేం ల్యాండ్ అయ్యేసరికి విమానం ముందుకు దెబ్బతిని ఉండటం చూశాం' అని ప్రయాణికుడు తెలిపాడు. బుధవారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీనగర్‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారి తెలిపారు. దీనిపై ఇండిగో ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. పైలట్, క్యాబిన్ సిబ్బంది ప్రోటోకాల్‌ను అనుసరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు పేర్కొంది.
VIDEO | A Srinagar-bound IndiGo flight from Delhi, carrying over 220 passengers, encountered severe turbulence due to inclement weather earlier today. The pilot declared an emergency to the Srinagar ATC, after which the aircraft landed safely and has since been grounded for… pic.twitter.com/t7cOF29hf6
— Press Trust of India (@PTI_News) May 21, 2025
ఇద్దరు మృతి
మరోవైపు వర్ష బీభత్సానికి దిల్లీలో అనేక ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. చెట్లు, విద్యుత్ స్తంభం మీద పడటంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతిచెందగా 11 మందికి గాయపడ్డారు. లోధి రోడ్ పైవంతెన సమీపంలో ట్రైసైకిల్‌పై వెళుతున్న దివ్యాంగుడిపై విద్యుత్ స్తంభం పడటం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడు. గోకుల్‌పురి ప్రాంతంలో చెట్టు పడటం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ముఖర్జీనగర్ సమీపంలో పాదాచారుల వంతెనకు సంబంధించిన ఓ భాగం ఊడిపడటంతో ఆరుగురు గాయపడ్డారు.
మంగోళ్‌పురి ప్రాంతంలో ఓ భవంతిలోని బాల్కనీ పడటంతో నలుగురు గాయపడ్డారు. దిల్లీ-నోయిడా, దిల్లీ-గజియాబాద్, దిల్లీ-గురుగ్రామ్ రహదారులపై చెట్లు పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బలమైన గాలుల ధాటికి ట్రాక్‌లపై పలు వస్తువులు పడటంతో మెట్రో రైళ్ల సేవలకు ఆటంకం కలిగింది. దిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది.