Bear Tiger Fight Viral Video : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొన్ని వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు ఆడ ఎలుగుబంటి, పులి మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఛత్తీస్‌గఢ్ నారాయణపుర్ జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో జరిగిన ఘటనకు చెందిన వీడియోగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విజువల్స్‌పై అటవీ శాఖ దర్యాప్తు చేస్తోంది.
వైరల్ వీడియో ప్రకారం, అబుజ్మద్ ప్రాంతంలోని పుగుఢ్ గ్రామంలో ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కొత్తగా నిర్మించిన రోడ్డుపై ఒక ఆడ ఎలుగుబంటి తన పిల్లతో రోడ్డు దాటుతుండగా, పులి అక్కడికి వచ్చింది. అప్పుడు ఆ టైగర్, ఆడ ఎలుగుబంటి, దాని పిల్లలు వైపు తిరిగింది. దీంతో ఎలుగు ఎలాంటి భయం లేకుండా పోరాడింది. తన పిల్లను వెనుక పెట్టుకుని మరీ పులిపైకి దండెత్తింది. దీంతో టైగర్ అడవిలోకి పారిపోయింది.
కొన్ని క్షణాలపాటు పులి, ఎలుగు పోరాటం సాగింది. మొత్తానికి ఆడ ఎలుగుబంటి ధైర్యాన్ని ప్రదర్శించి పులిని పారిపోయేలా చేసింది. ఆడ ఎలుగుబంటి తన పిల్లలను రక్షించుకోవడానికి క్రూరమైన పులితో ఎలా పోరాడిందో వీడియాలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే పులి, ఎలుగు పోరాటాన్ని ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డు చేయగా, వైరల్‌గా మారింది. కాగా, ఆ వీడియోపై నారాయణపుర్ అటవీశాఖ స్పందించింది.
వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా తమకు అందిందని అటవీ శాఖ డీఎఫ్‌వో శశిగానంద్ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆ ప్రాంతంలో అడవి జంతువులు, పులులు, ఎలుగుబంట్ల గురించి సమాచారం అందితే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణ పనులు వేగవంతం అవుతాయని చెప్పారు.