Tamil nadu BJP President Election : తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నయినార్ నాగేంద్రన్ దాదాపు ఖరారయ్యారు. అధ్యక్ష పదవి కోసం తిరునల్వేలి బీజేపీ ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. టి.నగర్‌లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి విచ్చేసి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలుచేయడం వల్ల ఎన్నిక లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నాయి. నాగేంద్రన్ ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నాగేంద్రన్ పేరును కె.అన్నామలై, కేంద్రమంత్రి ఎల్.మురుగన్, కేంద్ర మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ సైతం ప్రతిపాదించారు.
అన్నామలైపై అమిత్ షా ప్రశంసలు
మరోవైపు తమిళనాడు పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలైపై ప్రశంసలు కురిపించారు. తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నయినార్ నాగేంద్రన్ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై పనితీరు ప్రశంసనీయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను ప్రజలకు చేరవేయడంలోనైనా, పార్టీ కారక్రమాలను గ్రామ గ్రామానికీ తీసుకెళ్లడంలోనైనా ఆయన కృషి అపూర్వమైనదని ప్రశంసించారు. అన్నామలై సంస్థాగత నైపుణ్యాలను పార్టీ జాతీయ స్థాయిలో వినియోగించుకుంటుందని తెలిపారు.
అన్నాడీఎంకే, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు
ఇప్పటికే తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది.2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి నేతృత్వంలో పనిచేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో అన్నాడీఎంకే వైఖరి భిన్నంగా ఉన్నా, చర్చల ద్వారా కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తామని తెలిపారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము తలదూర్చబోమని వెల్లడించారు. అధికారం, సీట్ల పంపకాలపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు.