Tiger Dog Fight In MP Umaria : మధ్యప్రదేశ్‌లో ఒక శునకం తన యజమాని పట్ల చూపించిన విధేయతతో వార్తల్లో నిలిచింది. యజమానిని కాపాడేందుకు పులితో వీరోచితంగా పోరాడి ఆఖరికి ప్రాణాలు విడిచింది. శునకం పోరాట పటిమకు పులి బెదిరిపోయింది. ఉమారియా జిల్లాలోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ పక్కనే ఉన్న భార్హుట్ గ్రామంలో జరిగిందీ ఘటన.
అసలేం జరిగిందంటే?
శివమ్ అనే వ్యక్తి తన పొలంలో ఉన్నాడు. అకస్మాత్తుగా అతడికి ఎదురుగా పులి వచ్చి దాడికి యత్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న శివమ్ పెంపుడు కుక్క( జర్మన్ షెపార్డ్ జాతి) తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పులిపై దాడి చేసింది. ఈ రెండు జంతువుల మధ్య కొంతసేపు కొట్లాట జరిగింది. ఆఖరికి కుక్క ధైర్యం, తెగువ చూసి పులి అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఈ పోరాటంలో శునకానికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా యజమాని ఒంటి మీద గీత మీద పడకుండా కాపాడుకుంది. ఈ క్రమంలో యజమాని పట్ల శునకం చూపించిన విధేయతపై ప్రశంసలు దక్కుతున్నాయి.

శునకం ధైర్యానికి పారిపోయిన పులి
"నేను పొలంలో ఉన్నాను. అకస్మాత్తుగా పులి వచ్చి నాపై దాడికి ప్రయత్నించింది. అంతలో నా పెంపుడు కుక్క పులిపై దాడి చేసింది. ఈ పోరాటంలో నా శునకం తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత పులి దాన్ని గ్రామం పొలిమేరలోకి లాక్కెళ్లింది. అక్కడ దాన్ని విడిచిపెట్టి పారిపోయింది" అని జర్మన్ షెపార్డ్ శునకం యజమాని శివమ్ తెలిపాడు.

ఆస్పత్రిలో శునకం మృతి
తీవ్రంగా గాయపడిన శునకాన్ని వెంటనే పశువైద్యుడు డాక్టర్ అఖిలేశ్ సింగ్ వద్దకు తీసుకెళ్లామని శివమ్ తెలిపాడు. అక్కడ వైద్యుడు శునకాన్ని కాపాడటానికి తన శాయశక్తులా ప్రయత్నించారని పేర్కొన్నాడు. కానీ కుక్కను రక్షించలేకపోయారని వెల్లడించాడు. తీవ్ర గాయాలతో తన పెంపుడు కుక్క మరణించిందని చెప్పాడు.
జర్మన్ షెపార్డ్ జాతికి చెందిన కుక్క మెడపై తీవ్ర గాయాలు, దాని శరీరంపై పులి పంజా గుర్తులు ఉన్నాయని వైద్యుడు అఖిలేశ్ సింగ్ తెలిపారు. ఈ గాయాలు కూడా చాలా లోతుగా అయ్యాయని వెల్లడించారు. చికిత్స తర్వాత శునకం వెంటనే నడిచిందని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు విడిచిందని చెప్పారు.