Modi Uncle You Are My Hero : ప్రధాని నరేంద్ర మోదీకి, భారత సైన్యానికి కృతజ్ఞతలు చెబుతూ, ఓ ఏడేళ్ల ముస్లిం బాలుడు పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ బాలుడు మరెవరో కాదు, దిల్లీలోని చారిత్రాత్మక జామా మసీద్‌లో తరతరాలుగా ఇమామ్‌లుగా పనిచేస్తున్న బుఖారీల 15వ తరం వారసుడు. ఇంతకూ ఆ బాలుడు ఏం చెప్పాడంటే?
భారత్ ఘనవిజయం
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. దీనితో భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించి, పాక్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. అలాగే పాక్‌కు చెందిన 50కిపైగా డ్రోన్లను కూల్చేసింది. పాక్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ దెబ్బతో పాక్ కాళ్ల బేరానికి వచ్చి, కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది.
భారత్ సాధించిన ఈ ఘనవిజయానికి ప్రధాన కారణమైన భారత సైన్యానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో చాలా మంది ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఇలా పోస్టులు పెట్టినవారిలో దిల్లీలోని చారిత్రాత్మక జామా మసీద్ ఇమామ్ 7 ఏళ్ల మనవడు కూడా ఉన్నాడు.
మోదీ అంకుల్- మీ వల్లే మేము సేఫ్‌గా ఉన్నాం!
ప్రస్తుతం జామా మసీద్ ఇమామ్‌గా షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఉన్నారు. ఆయన ఏడేళ్ల మనవడే సయ్యద్ అరీబ్ బుఖారీ. ఇప్పుడు ఈ చిన్నారి పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎంతో మంది హృదయాలను కదిలిస్తోంది. దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
"మోదీ అంకుల్, మీరు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. ఉగ్రవాదులను అణిచివేశారు. మీరే మా నిజమైన నాయకుడు. నేను మొదట్లో చాలా బాధపడ్డాను. భయపడ్డాను. కానీ ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్నాను. ఇప్పుడు నేను మళ్లీ నా చదువుపై దృష్టి పెడతాను. భారత ప్రభుత్వానికి, మన వీర సైనికులకు ధన్యవాదాలు. జై హింద్."
- 7 ఏళ్ల బాలుడు సయ్యద్ అరీబ్ బుఖారీ ఇన్‌స్టా పోస్ట్
మోదీకి మద్దతుగా
భారతదేశంలో మతపరమైన, సాంస్కృతిక వారసత్వ సంపదల్లో ఒకటి దిల్లీలోని జామా మసీదు. ఇక్కడ ఇమామ్‌లు పనిచేస్తున్న వారిలో 14వ తరానికి చెందినవారు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ. ఇతని మనవడు అరీబ్ 15వ తరానికి చెందినవాడు. ఇది కేవలం ఆ చిన్నారి ప్రతిస్పందన మాత్రమే కాదు. దేశంలోని కోట్లాది పౌరుల భావాలకు చిహ్నం. అందుకే ఈ వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. చాలా మంది ఈ ఇన్‌స్టా పోస్ట్ కింద, 'జాతి ఆత్మ నిజమైన స్వరం' అని, 'ద్వేషాలు పెరిగిపోయిన ఈ యుగంలో ఇలాంటి ప్రేమ ఆశాజనంగా ఉంటుంది' అని కామెంట్లు పెడుతున్నారు.
దేశంలోని ఒక ప్రముఖ ముస్లిం ఇమామ్ కుటుంబానికి చెందిన పిల్లవాడు, ప్రధాని నరేంద్ర మోదీకి, భారత సైన్యానికి బహిరంగంగా కృతజ్ఞతలు, మద్దతు తెలపడం గమనార్హం. ఇది దేశ భద్రత, శాంతి కోసం మతాల అడ్డుగోడలను కూల్చేసిన ఘటన అని చెప్పుకోవడం ముదావహం.
పాకిస్థాన్‌కు పీడకలగా 'డీ4 యాంటీ డ్రోన్ సిస్టమ్'- దీని ప్రత్యేకతలు ఇవే?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌పై 15లక్షల సైబర్ దాడులు- ఇతర దేశాలతో కలిసి పాకిస్థాన్ దుస్సాహసం!