ఎలా బతికానో నాకే తెలియట్లేదు- మొత్తం కళ్ల ముందే జరిగింది: 'మృత్యుంజయుడు' విశ్వాస్
మీడియాతో మాట్లాడిన విమాన ప్రమాద మృత్యుంజయుడు- వెనుక సీట్లోనే రూపానీ ఉన్నారట!

Published : June 13, 2025 at 12:53 PM IST
|Updated : June 13, 2025 at 1:05 PM IST
Ahmedabad Plane Crash Survivor: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు విశ్వాస్ కుమార్ రమేశ్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు, విమాన ప్రమాదం గురించి మీడియాతో మాట్లాడాడు. ఎలా బతికానో తనకే అర్థం కాలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడరని, ఘటన గురించి అడిగారని తెలిపాడు.
"విమానం కూలగానే నేను కూర్చున్న సీటు హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లో పడింది. నేనేం దూకలేదు. నా సీటు ఊడడం వల్ల దూరంగా ఎగిరిపడ్డా. అప్పుడు బయటకు వచ్చేందుకు ప్రయత్నించా. ఎదురుగా ఒక భవనం గోడ కనిపించింది. దాని పక్క నుంచి బయటకు వచ్చా. నేను ఎలా బతికానో నాకు తెలియదు. మంటలు చెలరేగినప్పుడు నా ఎడమ చేయి కాలిపోయింది. ఆ తర్వాత నన్ను ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు నన్ను బాగా చూసుకుంటున్నారు" అని తెలిపాడు.
"విమానం కూలిన ఘటన గురించి ప్రధాని మోదీ నన్ను అడిగారు. అదంతా నా కళ్ల ముందే జరిగింది. నేను ఎలా ప్రాణాలతో బయటపడ్డానని నమ్మలేకపోయాను. నేను కూడా చనిపోయానని అనుకున్నాను. కానీ నేను కళ్లు తెరిచేసరికి శిథిలాల మధ్య ఉన్నా. చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భయంతో అక్కడి నుంచి మెల్లగా బయటకు వచ్చాను" అని చెప్పాడు.
Visited the crash site in Ahmedabad today. The scene of devastation is saddening. Met officials and teams working tirelessly in the aftermath. Our thoughts remain with those who lost their loved ones in this unimaginable tragedy. pic.twitter.com/R7PPGGo6Lj
— Narendra Modi (@narendramodi) June 13, 2025
"విమానం టేకాఫ్ అయిన తర్వాత కొంతసేపటికే పాటు ఏదో జరుగుతున్నట్లు మాకు అనిపించింది. విమానంలో గ్లీన్, వైట్ లైట్స్ ఆగిపోయాయి. టేకాఫ్ కోసం విమానం వేగం పెంచారని అనిపించింది. ఇంతలోనే హాస్టల్ భవనంలోకి దూసుకెళ్లింది" అని విశ్వాస్ పేర్కొన్నారు. కొన్ని ఏళ్లుగా భార్య బిడ్డలతో లండన్‌లో ఉంటున్నానని తెలిపారు. ప్రమాద సమయంలో తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని, ఆయన ఆచూకీ తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో విశ్వాస్ కుమార్ సీట్ నంబర్ 11A. వెనుక వరుసలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ కూర్చున్నారు. ఆయన సహా 241 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో విశ్వాస్ కుమార్ వాంగ్మూలం కీలకం కానుంది. అయితే విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులతోపాటు విశ్వాస్ కుమార్‌ను పరామర్శించారు.
బ్రిటన్ దేశస్తుడైన 40 ఏళ్ల విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొద్దిరోజుల క్రితం భారత్ వచ్చాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేశ్‌తో కలిసి బ్రిటన్ తిరిగి వెళుతుండగా, వారు వెళుతున్న విమానం ప్రమాదానికి గురైంది. అయితే విశ్వాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, కొద్దిరోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు.
విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ కీలక సమావేశం
'మృత్యు' విమానానికి 265 మంది బలి- అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ

